వీధికెక్కిన మాజీ, ప్రస్తుత పెళ్లాలు..! నలిగిపోతున్న ట్రంప్!!

Vasishta

ఎంత గొప్పవాడైనా పెళ్లాం ముందు తలొగ్గాల్సిందేనని సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇందుకు అమెరికా అధ్యక్షుడూ అతీతుడు కాదు. ఇద్దరు పెళ్లాల మధ్య నలిగిపోయే భర్తల బాధలు వర్ణించలేం. ఇప్పుడు అగ్రరాజ్యాధినేత ట్రంప్ కు ఇదే కష్టమొచ్చింది. మాజీ భార్య మొదలుపెట్టిన రచ్చను ప్రస్తుత భార్య కొనసాగిస్తుండడంతో ఏం చేయాలో తెలియక డోనాల్డ్ ట్రంప్ తల పట్టుకుంటున్నారు.

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. అగ్రరాజ్యానికి ఆయన ప్రథమ పౌరుడు కావడంతో ప్రథమ మహిళ హోదాపై ట్రంప్‌ భార్యల మధ్య చిచ్చు రేగుతోంది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడంతో ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.

 

ట్రంప్‌ మొదటి భార్య ఇవానా ట్రంప్‌.. రైజింగ్‌ ట్రంప్‌ పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో ట్రంప్‌తో తన వైవాహిక జీవితం, విడాకులు, పిల్లల్ని పెంచడం లాంటి వివరాలు వెల్లడించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరూ విడిపోయినట్టు పుస్తకంలో రాశారు. అదే వివాదానికి తెర లేపింది.

 

రైజింగ్ ట్రంప్ బుక్ ప్రమోషన్ చేస్తున్న ఇవానా ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు తాను ప్రథమ మహిళకు అర్హురాలిని అని చెప్పుకొచ్చారు. “నేను ట్రంప్‌కు మొదటి భార్యను.. అంటే నేను దేశానికి మొదటి మహిళను.. నేను శ్వేతసౌధానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లొచ్చు.. కానీ నేను వెళ్లాలనుకోవడం లేదు” అని చెప్పారు. అంతే కాదు.. తాను ఎవరికీ అసూయ కలిగించాలనుకోవడం లేదు.. కానీ మెలానియా వైట్ హౌస్ లో ఉండేందుకు కష్టపడుతున్నట్టుంది అంటూ చురకలంటించారు.

 

ఇవానా కామెంట్స్ పై మెలానియా స్పందించింది. దీనిపై మెలానియా అధికార ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.  వైట్‌హౌస్‌లో మెలానియా హ్యాపీగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రథమ మహిళగా తన బాధ్యతలను ఎంతో గౌరవిస్తున్నారు. ఈ హోదాతో చిన్నారుల సంరక్షణకు ఆమె కృషిచేస్తున్నారు. అంతేగానీ.. పుస్తకాలు అమ్ముకోడానికి కాదు అని ప్రకటనలో పేర్కొన్నారు.

 

ఇద్దరు భార్యలు ఇలా రచ్చకెక్కడంతో ఏం చేయాలో తెలియక ట్రంప్ తల పట్టుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు వరకూ ఇవానా ఎప్పుడూ ఈ అంశంపై నోరు మెదపలేదు. అయితే ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇవానా ఇలాంటి వ్యాక్యలు చేయడం ప్రచారంకోసమేనన్న విమర్శలు ఎదురవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: