టీఆర్ఎస్, టీడీపీల మధ్య పొత్తుకు మధ్యవర్తి ఎవరో తెలుసా..!?

Vasishta

తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు కేసీఆర్.. టీడీపీతో పొత్తుకు సంసిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే టీడీపీ – టీఆర్ఎస్ మధ్య పొత్తుకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చారు.


          తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అక్కడ పార్టీ అనుసరించిన విధానం, నాయకత్వలేమి, గెలిచినవాళ్లు వీడిపోవడం.. లాంటి అనేక కారణాలు టీడీపీని ఒంటరిని చేసేసాయి. అయితే ఇప్పటికీ టీడీపీకి గట్టి సంస్థాగత నిర్మాణం ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డి, రమణ లాంటి వాళ్లు పార్టీని బలోపేతం చేయడానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారు.


          అయితే ఇప్పటికిప్పుడు టీడీపీ  బలపడడం, అధికారంలోకి రావడమనేది కలే. అయితే ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి లేదా రాకుండా చేయడానికి కీరోల్ పోషించనుంది. దీంతో.. టీడీపీతో పొత్తుకు ఏ పార్టీ అయినా సంసిద్ధంగానే ఉంది. ముందుగా అధికార టీఆర్ఎస్ .. టీడీపీతో పొత్తు తమకెంతో కలసి వస్తుందని భావిస్తున్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా టీఆర్ఎస్ బలపడడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలను బలహీనపర్చవచ్చనేది కేసీఆర్ వ్యూహం.


          టీఆర్ఎస్, టీడీపీ పొత్తుపై దాదాపు ఇరు పార్టీలూ సంసిద్ధంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. టీడీపీతో తుమ్మల నాగేశ్వర రావుది సుదీర్ఘ ప్రస్థానం. ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇప్పటికీ టీడీపీతో సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చొరవ తీసుకుంటానన్నారు. అయితే ఏదైనా కేసీఆర్ అనుమతితోనే నని స్పష్టం చేశారు.


          టీడీపీకి ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు 15 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించేందుకు టీఆర్స్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇదంతా అనధికారికం మాత్రమే. అసలు ఈ పొత్తుకు సంబంధించి కేసీఆర్ కానీ, చంద్రబాబు కానీ నోరు మెదపలేదు. ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: