జగన్ కు ఊరట లభిస్తుందా..? కొనసాగుతున్న సస్పెన్స్..!

Vasishta

నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఆరు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా తిరగనున్నారు. అయితే ఇందుకోసం కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రతి శుక్రవారం కోర్టు మినహియింపు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పెట్టుకున్న పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడడంతో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.


          జగన్ పాదయాత్రకు సర్వం సిద్ధం చేసుకున్నారు. 13 జిల్లాల్లో సుమారు 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసేశారు. అయితే ఇప్పుడు కావాల్సిందల్లా కోర్టు మినహాయింపు. ప్రస్తుతం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. పాదయాత్రకు వెళ్లాలంటే కోర్టుకు నేరుగా హాజరు కాకుండా మినహాయింపు కావాలి.


          ఓ రాజకీయ పార్టీ అధినేతగా నిత్యం ప్రజల్లో ఉండాల్సి రావడం, ఇప్పుడు పాదయాత్ర చేస్తుండడంతో తనకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు స్వీకరించింది. విచారణకు అంగీకరించింది. దీనిపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపిన కోర్టు ఈ నెల 20వ తేదీకి మరోసారి వాయిదా వేసింది.


          కోర్టు మినహాయింపు తప్పకుండా లభిస్తుందని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల ముందు జగన్ కు 3 నెలలపాటు మినహాయింపు లభించింది. గత నెలలో లండన్ వెళ్లినప్పుడు కూడా ఓసారి రిలీఫ్ దొరికింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఆరు నెలలు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు. ఒకవేళ ఆరు నెలలు ఇవ్వడానికి కోర్టు అంగీకరించకపోతే.. కనీసం 3 నెలలైనా దొరుకుతుందని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే పాదయాత్ర మధ్యలో ఓసారి మాత్రమే కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. అదేమీ పెద్ద సమస్య కాబోదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి 20వ తేదీన ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: