టీడీపీలో ఆల్ ఈజ్ వెల్ ..! ఎందుకో తెలుసా..?

Vasishta

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు అటు అధికారం, ఇటు పార్టీ పనితీరు చంద్రబాబుకు  సంతృప్తి కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఓ మోస్తరుగా రెస్పాండ్ అయిన నేతలు కూడా ఇప్పుడు గాడిలో పడ్డారు. ఇంతకూ వీళ్లందరికీ ఊపు తెచ్చిన కార్యక్రమం ఏంటో తెలుసా..?


ఎన్నికల సమయంలో ఓటర్లను కలవడం రాజకీయ పార్టీలు సాధారణంగా చేసే పని.. కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలను కలసి వారి సమస్యలను తెలుసుకోవడం వంటివి కొన్ని పార్టీలు మాత్రమే చేస్తూ ఉంటాయి. అదే కోవలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ.. 2019లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ.. వారి సమస్యలను తెలుసుకునేందుకు టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.


రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పార్టీ నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా అధికారంలో ఉన్నా ప్రజలతో మమేకం కాకపోతే ఆ అధికారం దూరమైపోతుందని గ్రహించిన పార్టీ అధినేత చంద్రబాబు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు.


సెప్టెంబర్ 11 నుంచి ఈనెల 30 వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ యోచన చేసింది. అయితే వైసీపీ అధినేత జగన్ వచ్చే నెలలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో చంద్రబాబు దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఇంటింటికి తెలుగుదేశాన్ని మరో 90 రోజులు పొడిగించినట్లు సమాచారం. దీన్ని బట్టి ప్రతిపక్షం ఏ కార్యక్రమం చేసినా దానికి బదులిచ్చే మరో కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.


రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలను పార్టీ నాయకులు కలిసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడిందని.. అందుకే 90 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ 60 లక్షల కుటుంబాలను తెలుగు దేశం పార్టీ నేతలు పలకరించినట్టు సీఎం వివరించారు. దీన్నిబట్టి పార్టీ శ్రేణులు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఉత్సాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: