నంది అవార్డుల పరిష్కారానికి బాబు హైటెక్ ఐడియా..!

siri Madhukar
ఇటీవల ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పుల్లో ఉన్న రాష్ట్రం అయినా.. ఒకేసారి మూడు సంవత్సరాలకు సంబంధించిన అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుల ఎంపిక వివాదం కావడం.. దీనిపై కొన్ని మీడియా సంస్థలు రాద్ధాంతం చేయడంతో ఏపీ సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారట. నంది అవార్డుల వ్యవహారం ఇలా రచ్చ అవుతుందని అనుకోలేదని ఆయన బాధపడ్డారట. 


ప్రతి విషయానికి కులం రంగు పులమడం సరైన పనా అంటూ సీఎం వాపోయారట. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులిచ్చామని.. అవార్డుల ఎంపికలో ప్రభుత్వ పరంగా, రాజకీయపరంగా ఎవరూ జోక్యం చేసుకోలేదని ఆయన పార్టీ నేతలకు వివరణ ఇచ్చారట. అవార్డుల వివాదంపై టీడీపీలోనూ బాగానే చర్చ జరుగుతోంది. అసలు ఈ అవార్డులు ఇలా వివాదం అవుతాయనుకుంటే.. ఐవీఆర్ఎస్ ద్వారా ఎంపిక చేసేవారమని చంద్రబాబు అన్నారు. 


ఔను.. చంద్రబాబు భావించినట్టు..ఇకపై నంది అవార్టులు ఐవీ ఆర్ఎస్ ద్వారా ఎంపిక చేస్తే వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు. ఇంతకూ ఈ ఐవీఆర్ఎస్ ఏంటి అనుకుంటున్నారు. ఈ ఐవీఆర్ఎస్ మంత్రాన్ని చంద్రబాబు తరచూ ఉపయోగిస్తుంటారు. ఎస్ ఎం ఎస్ ల ద్వారా , ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల స్పందన తెలుసుకోవడమే ఐవీఆర్ఎస్. 


ప్రజల్లో నాయకులపై ఉన్న అభిప్రాయాలను చంద్రబాబు ఈ ఐవీఆర్ఎస్ ద్వారానే తెలుసుకుంటుంటారు. పార్టీ నేతల భవితవ్యాన్ని దీన్నిబట్టి నిర్ణయిస్తుంటారు. శాస్త్రీయమైన పద్దతి కావడంతో నాయకులు కూడా దీనిపై నోరెత్తడం లేదు. ఇకపై ఈ ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే బాగానే ఉంటుంది. మరి 2017 నంది అవార్డులు ఈ కొత్త పద్దతి ద్వారానే ఇస్తారేమో. అంతవరకూ బాగానే ఉన్నా..ఇంత వరకూ సింహా అవార్డులు ప్రకటించని తెలంగాణ సర్కారుపైనా ఒత్తిడి పెరుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: