ప్రమాదంలో పడుతున్న ప్రజాస్వామ్యం : బరాక్ ఒబామా

కాలాంతరంలో పాలనా విధానం క్రమానుగతంగా పరిణామం చెందుతూ చివరికి ప్రజాస్వామ్య రాజ్యాలు ప్రపంచమంతా విల సిల్లుతున్నాయి. రాజులు రాజ్యాధికారం, నియంతృత్వం అంటే ఏకవ్యక్తి నిరంకుశ పాలన పార్టి వ్యవస్థలతో కమ్యూనిజం ఒక వర్గ నిరంకుశత్వం ఇలా పరిణామం చెందుతూ తాజాగా అత్యుత్తమం అనదగ్గ ప్రజాస్వామ్యం ప్రపంచ వ్యాప్తంగా పరిఢవిల్లు తున్నాయి.



ఇంతగా ఎదిగిన  ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ‘హిందుస్థాన్ టైమ్స్- లీడర్‌షిప్ సదస్సు" లో శుక్రవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. అమెరికాది అత్యంత పురాతన ప్రజాస్వామ్యమని, భారత్‌ది అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు.



"ఇంటర్నెట్‌" తో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందన్నారు. ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో ఎప్పటి కప్పుడు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. పేద -ధనికుల వ్యత్యాసాన్ని తొలగించాలని అభిప్రాయపడ్డారు. 'పారిస్ వాతావరణ ఒప్పందం' కోసం తాను, భారత ప్రధాని నరెంద్ర మోడీ అంకిత భావంతో కృషి చేశామని ఒబామా చెప్పారు.



“మీడియా-సమాచార వ్యవస్థ ”  ప్రజాస్వామ్యానికి నాలుగవ స్థంబని,  అయితే ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పేదలకు ఉపయోగపడే వార్తలను రాయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా ప్రజల్లో అభద్రతాభావం ఉందని, దాన్ని తొల గించినప్పుడే మానవ ప్రగతి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.


ప్రపంచంలో ఉగ్రవాదం సృష్టిస్తున్న మారణహోమం తెలిసిందేనని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. "న్యూక్లియర్ సప్లయి గ్రూప్ -ఎన్‌ఎస్‌జి" లో భారత్‌ను చేర్చేందుకు తాము ప్రయత్నించినప్పటికీ, కొన్ని దేశాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. ప్రధాని నరెంద్ర మోడీ భారత్ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్నారని, ఆయన్ను తాను వ్యక్తిగతంగా ఇష్టపడుతానని ఒబామా తెలిపారు.



నాడు పాకిస్థాన్ లో లాడెన్ ఉన్నట్లు, న్యూయార్క్ జంట భవనాలపై టెర్రరిస్టు దాడి సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో తలదాచుకున్న విషయం పాక్ ప్రభుత్వాని కి తెలుసుననడానికి తమ వద్ద రుజువులు లేవని ఒబామా చెప్పారు. 2008 నవంబర్‌లో ముంబయి దాడులను ఆయన ప్రస్తావిస్తూ భారత్ వలెనే అమెరికా కూడా అప్పట్లో టెర్రరిస్టు నెట్‌వర్క్‌ను తుదముట్టించాలని దృఢ సంకల్పంతో ఉన్నవిషయం ఆయన గుర్తు చేశారు.


భారత ప్రభుత్వానికి సహాయపడేందుకు అమెరికా గూఢచారి సిబ్బందిని తాము పంపినట్లు చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఉగ్ర కార్యకలాపాల గురించి అడగ్గా పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలకు ఆ ప్రభుత్వ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావించడానికి ఆస్కారం కొన్ని సందర్భాలలో కలిగినట్లు చెప్పారు.



అబాటాబాద్  లో లాడెన్ ఉనికి గురించి పాకిస్థాన్ ప్రభుత్వానికి తెలుసునని భావిస్తున్నారా?  అని అడగ్గా, అలా అనడానికి  తమ వద్ద ఆధారాలు  లేవని చెప్పారు. 2011 మే నెల  లో లాడెన్‌ను అమెరికా నౌకాదళ బలగాలు అబాటాబాద్ లో మెరుపు దాడి జరిపి సంహరించాయి. భారత దేశంలో అణు రియాక్టర్ల నిర్మాణానికి భారత, అమెరికా దేశాల భారీ అణు విద్యుత్ సంస్థలు జిఇ, వెస్టింగ్ హౌస్ కంపెనీల మధ్య పురోగతి లేనందుకు అసంతృప్తి చెందుతున్నారా?  అని అడగ్గా అమెరికా కంపెనీలకు అవకాశాలు ఇవ్వ డానికే తన పాత్ర పరిమితమని చెప్పారు.



భారత్ వద్ద చెప్పుకో దగ్గ స్థాయిలో అణు శక్తికి కావలసిన మౌలిక సౌకర్యాలు ఉన్నాయని ఆయన వివరించారు. ద్వైపాక్షిక సంబంధాలకు అణు రియాక్టర్ల నిర్మాణ అంశం అడ్డురాకుండా జాగ్రత్త పడినట్లు కూడా తెలిపారు. 2008లో కుదిరిన అణు శక్తి సహకార ఒప్పందం మేరకు అమెరికా కంపెనీలు ఆరు రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ లలో నిర్మించవలసి ఉంది. దీనిపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్లు తెలిపారు. భారత్‌ను 48సభ్యుల అణు సరఫరా దేశాల గ్రూపులో చేర్చడానికి అమెరికా ఎంతగానో కృషి చేసిందని కూడా ఆయన చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: