చివర్లో బీజేపీకి బూస్ట్ తాపించిన అయ్యర్..!!

Vasishta

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ.. నీచ్ ఆద్మీ.. అంటూ వ్యాఖ్యానించిన మణిశంకర్ అయ్యర్ రెండు పార్టీల ఆగ్రహానికి గురయ్యారు. బీజేపీ నేతలు మణి శంకర్ అయ్యర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటు.. కాంగ్రెస్ పార్టీ కూడా మణిశంకర్ ను ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది..


2014లో న‌రేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’ అంటూ హేళన చేసి మాట్లాడిన మణిశంకర్ తాజాగా మరోమారు మోదీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అంబేద్కర్ ఆశ‌యాల‌కు వాస్తవ రూపం తేవడానికి జవహ‌ర్‌లాల్‌ నెహ్రూ కృషి చేశార‌ని, అటువంటి కుటుంబంపై ప్ర‌ధాని మోదీ అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన అయ్యర్... మోదీ నీచుడు, సభ్యత లేనివాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు..


అయ్యర్ తనపై చేసిన వ్యాఖ్యలను నరేంద్ర మోదీ తనదైన శైలిలో తిప్పికొట్టారు. గుజరాత్ ఎలక్షన్ ప్రచారంలో ఎత్తుకు పై ఎత్తు వేశారు. మణిశంకర్ వ్యాఖ్యలపై భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘మణిశంకర్.. నన్ను నీచుడని అన్నారు.. నేను నీచుడైతే.. గుజరాత్ ప్రజలంతా నీచులే అని దాని అర్థం.. మనమందరం తక్కువ వారమే.. అందుకే వారికి బుద్ధి చెబుదాం.. వచ్చే ఎలక్షన్ లో వారిని మట్టి కరిపిద్దాం..’’ అని మోడీ ఆగ్రహంతో ప్రసంగించారు.. బీజేపీ నేతలు ఒక్కోక్కరుగా మణిశంకర్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేత అమిత్ షా.. ఘాటుగా విమర్శించారు. మణిశంకర్ మాటల ద్వారా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు..


కాంగ్రెస్ పార్టీ మణి శంకర్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. వెంటనే క్షమాపణ చెప్పాలని మణిశంకర్ కు సూచించింది. అంతేగాక ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసింది. ‘నీచ్‌ ఆద్మీ’  వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ మణిశంకర్ కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయ్యర్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. మణిశంకర్‌ అయ్యర్‌.. ప్రధాని మోదీని సంబోధించిన తీరును సమర్థనియం కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు మోదీకి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నట్లు  రాహుల్‌ ట్వీట్‌ చేశారు.


అధినేత ఆదేశాలు, పార్టీ నేతల వ్యతిరేక వ్యాఖ్యలతో దిగివచ్చిన మణిశంకర్ అయ్యర్... మోదీకి  క్షమాపణలు చెప్పారు. తనకు హిందీ రాదని.. తన దృష్టిలో నీచ్ ఆద్మీ అంటే.. తక్కువ.. అని అర్థం అని చెప్పుకొచ్చారు. ఏవైనా తప్పులు దొర్లుంటే.. క్షమించాలని మోదీని కోరారు... మణి శంకర్ వ్యాఖ్యల దుమారం బీజేపీ, కాంగ్రెసా పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. సరిగ్గా ఎన్నికల ముందు రోజు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు రావడం బీజేపీకి ప్లస్ పాయింట్ గా.. కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్ గా అభివర్ణించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: