జగన్ లో ఒక్కసారిగా ఇంత మార్పు ఎందుకో..!?

Vasishta

ప్రజా సంకల్పయాత్రలో జగన్ ప్రసంగం స్టైల్ మార్చారు. 35రోజులు పాదయాత్ర పూర్తిచేసుకున్న జగన్.. ప్రసంగం పంథాను మార్చేశారు. ప్రజలను ఆకట్టుకునేలా హామీలు ఇస్తున్నారు. ప్రాంతాల వారీగా సమస్యలను ప్రస్తావిస్తూ జనంతో మమేకం అవుతున్నారు. ఇప్పటికే 457 కిలోమీటర్ల మైలురాయిని అందుకున్న జగన్.. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా జగన్ అడుగులు వడివడిగా పడుతున్నాయి. ప్రజా సంకల్ప యాత్రలో జనాకర్షణమైన హామీలతో ప్రసంగాల బాణిని, వాణిని పెంచారు జగన్.. ఇన్నాళ్లూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తాను ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ వస్తున్న జగన్ స్టైల్ మార్చారు. ప్రతిరోజు బహిరంగ సభలో చేస్తున్న ప్రసంగం ప్రజలను అకట్టుకోవడం లేదని, ఒకే మూసగా ప్రసంగం ఉండటం వల్ల ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోతున్నామనే సొంత సర్వే నివేదికలతో తన ప్రసంగాల్లో మార్పుకు శ్రీకారం చుట్టారు.


ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన 35రోజుల్లో ఇప్పటికి 457 కి.మీ మైలురాయి దాటిన జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తాననేదానిపై పక్కా క్లారిటీ ఇస్తున్నారు. హామీలతో జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. కడప, కర్నూలు మీదుగా అనంతపురం జల్లాలోకి అడుగిడిన జగన్ అనంతపురం జిల్లాలో స్పీచ్ ను కొంత పుంతలు తొక్కించారు. అధికారంలోకి వస్తే మైనార్టీల ఆత్మీయ సదస్పుల్లో మసీదులు, చర్చిలు, దేవాలయాల నిర్వహణ కోసం ప్రతి నెల 15వేల రూపాయలు ఇస్తామని చెప్పడం వల్ల అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.


పాపంపేట సభలో చేసిన ప్రసంగంలో తాను అమలు చేయలేని హామీలు ఇవ్వనని, రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేయడమే కాక తిరిగి వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామంటూ మహిళల ఓటర్లను అకట్టుకునే ప్రయత్నం చేశారు. రాప్తాడు బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భూరికార్డుల తారుమారుతో కోట్ల విలువైన భూములను కాజేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భూములు రీసర్వే నిర్వహించి భూయాజమాన్య హక్కులను కట్టుదిట్టం చేస్తామన్నారు. రాష్ట్రంలో భూ రికార్డుల తారుమారు, గందరగోళం పై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.


మరోవైపు వ్యవసాయానికి పగలు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని, మండల కేంద్రాల్లో గోదాములు, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని, మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి, నాలుగు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి, రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామంటున్న జగన్ హామీలను ప్రజలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రజా సంకల్ప యాత్రకు ప్రజా స్పందన లేదంటూ విమర్శలు గుప్పిస్తున్న అధికార పార్టీ నేతలు సైతం ఎప్పటిప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారు. ఏఏ నియోజక వర్గాల్లో ఏస్ధాయిలో ప్రజా స్పందన లభిస్తోందని ఆరాతీస్తున్నారు.. అందుకు కారణాలేమిటి అనే విశ్లేషణ సాగుతున్నట్లు సమాచారం. దీంతో జగన్ కూడా తన సొంత సర్వేలతో రోజురోజుకి ప్రసంగం స్టైల్ మారుస్తూ ప్రజల నాడిని పసిగడుతూ హామీల వర్షాన్ని గుప్పిస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: