మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ...!

Edari Rama Krishna
గుజరాత్ లో ఉదయం నుంచి ఉత్కంఠత నెలకొంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజల నుంచి మద్దతు పెరిగిందా, తగ్గిందా చెప్పే ఫలితాలు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టాభిషిక్తుడైన రాహుల్ గాంధీ బలమెంతుందో చూపించే ఫలితాలు. యావత్తు భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాలు.

ఐదో రౌండ్ ఫలితాల వరకూ విజయలక్ష్మి దోబూచులాడుతుండటంతో కాస్తంత ఆందోళనగా కనిపించిన బీజేపీ శ్రేణులు, ఆపై ఫలితాల సరళి తమకు అనుకూలంగా మారడం, ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 92కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో సాగుతుండటంతో గాంధీనగర్ పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం మొదలైంది.

ఈ ఉదయం పార్లమెంట్ కు వచ్చిన ఫలితాలపై తన హర్షాన్ని తెలియజేస్తూ, విక్టరీ సంకేతాన్ని చూపించారు. చిరు దరహాసంతో విజయ సంకేతాన్ని చూపుతూ పార్లమెంట్ లోపలికి వెళ్లారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాగా, పలువురు కీలక బీజేపీ నేతలు, మంత్రులు విజయం దిశగా సాగుతున్నారు.

తమకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటేల్ వర్గీయుల ఓట్లు గంపగుత్తగా తమకు పడతాయని భావించిన కాంగ్రెస్ కు భంగపాటు ఎదురైందని చెప్పవచ్చు. పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న సౌరాష్ట్రలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం అందుతున్న సరళిని బట్టి బీజేపీ 22, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉంది.

ఎలక్షన్ కమిషన్ తాజా ప్రెస్ రిలీజ్ ప్రకారం, బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటే సూచనలు కనిపిస్తున్నాయి. 97 స్థానాల్లో బీజేపీ, 71 స్థానాల్లో కాంగ్రెస్ ఒక చోట నేషనలిస్ట్ కాంగ్రెస్, రెండేసి స్థానాల్లో భారతీయ ట్రైబల్ పార్టీ, స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: