స్పెషల్ ఫీచర్: ట్రిపుల్ తలాఖ్ కు తిలోదకాలు

"ట్రిపుల్‌ తలాక్‌" (తలాక్‌–ఈ–బిద్దత్‌) ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే "ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు" కు గురువారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు ప్రతి పక్షాల పార్లమెంట్ సభ్యుల ఆందోళనల మధ్య, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 'మహిళా సాధికారత, మహిళల హక్కులను గౌరవించే దిశగా దేశ చరిత్ర లో ఇది చాలా గొప్ప సుదినమని’ రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. "మహిళల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్న సమయంలో పార్లమెంటు నిశ్శబ్దంగా ఉండొచ్చా?" అని ప్రశ్నించారు.


ఈ బిల్లు ఏ మతానికీ ఉద్దేశించినది కాదని, భారత దేశంలో మహిళలకు గౌరవం, భద్రత, న్యాయం కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్పాల్సిన తరుణమొచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ట్రిపుల్‌ తలాక్‌ అమానవీయమని, సరైన చట్టం తీసుకురావటం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించొచ్చని సూచించిన విషయాన్నీ రవిశంకర్‌ ప్రసాద్‌ గుర్తుచేశారు. యూపీలోని రాంపూర్‌లో గురువారం ఉదయం (ఈ బిల్లు పర్లమెంత్ లో శాసనమౌతున్న రోజున) కూడా ఒక మహిళ ఆలస్యంగా నిద్రలేవటంతో భర్త తక్షణమే ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన విషయాన్ని సభలో రవిశంకర ప్రసాద్ లోక్-సభలో ప్రస్తావించారు.


ఈ బిల్లుకు టీడీపీ, కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు ప్రకటించగా, ముస్లిం ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ బిల్లుపట్ల ఇప్పటి వరకూ స్పందించలేదు. లాక్ పై చర్చకు తెలంగాణా రాష్ట్ర సమితి దూరంగా ఉండిపోయింది.  సమాజ్ వాదీ పార్టీ ట్రిపుల్ తలాఖ్ బిల్లును వ్యతిరేకించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూనే, విడాకులుపొందిన ముస్లింమహిళలకు న్యాయంజరిగేలా మరిన్ని నిర్దిష్టమైనఅంశాలను బిల్లులో చేర్చాలని పట్టుబట్టింది. విపక్షాల సవరణలు తిరస్కరిస్తూ, మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. 


లోక్‌సభలో ఎంఐఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి ఆ సవరణకు వ్యతిరేకంగా 241 మంది సభ్యులు ఓటు వేయగా, మద్దతుగా 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. గృహ హింసపై ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరిస్తున్న ఈ తరుణంలో కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన ఎలుగెత్తి ప్రశ్నించారు. ఈ బిల్లు ముస్లింల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటమేనని కాంగ్రెస్‌ నేత, మాజీ న్యాయ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ విమర్శించారు.


కేంద్ర హోంశాఖ అమాత్యులు రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీ ఈ బిల్లును రూపొందించింది. అయితే ట్రిపుల్ తాలాఖ్ బిల్లులో ఉన్న న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తే:


మూడుసార్లు తలాక్ చెప్పి భార్యను వదిలించుకునే దుష్ఠ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. బిల్లు ప్రకారం, తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ లెదా ట్రిపుల్ తలాఖ్ అని భర్త నోటి తో చెప్పినా, రాత పూర్వకంగా తెలిపినా, ఈ మెయిల్, ఎస్సెమ్మెస్, వాట్సప్ తదితర అంతర్జాల సందేశాలను పంపినా ఇకనుండి అక్ర మమే. ట్రిపుల్ తలాఖ్ చెప్పిన భర్త పై భార్య, మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తనకు, తన మైనర్ పిల్లలకు జీవనభృతి కల్పించాలని నిర్భయంగా కోరవచ్చు. ఈ చట్టం ప్రకారం దోషిగా తేలితే మూడేళ్లు జైలుతో పాటు జరిమానా కూడా విధిస్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత ఇప్పటి వరకు 177 ట్రిపుల్ తలాఖ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మూడుసార్లు తలాక్ మౌఖికంగా భర్త చెప్పగానే విడాకులయ్యే తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ - దురాచారానికి అడ్డుకట్ట పడింది. 
 

"సివిల్ చట్టానికి, క్రిమినల్ చట్టానికి మధ్య తేడాను గ్రహించడంలో న్యాయశాఖమంత్రి విఫలమయ్యారని, ఏ ముస్లిం దేశం లోనూ ఇలాంటి శిక్షా నియమంలేదు. ట్రిపుల్ తలాఖ్ అనేది మౌఖిక, భావోద్వేగ దురాచారం" అని ఒవైసీ వివరించారు.
ట్రిపుల్ తలాఖ్‌ పై డ్రాఫ్ట్ రూపొందించే సమయంలో కేంద్రం ముస్లింలను సంప్రదించలేదని అసదుద్దీన్ ఒవైసీఆరోపించారు  దేశ వ్యాప్త చర్చ సరిగా జరపకుండానే ముసాయిదా బిల్లు రూపొందించిన దరిమిలా దీనిలోని పవిత్రతను పదే పదే  ప్రశ్నించారు. 


లోక్‌సభ ట్రిపుల్ తలాఖ్ బిల్లును ఆమోదించిన అనంతరం పార్లమెంట్ భవనం వెలుపల అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, "ఈ బిల్లు ముస్లిం మహిళలకు అన్యాయం చేసేలా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంది. ముస్లిం మహిళ లనే కాక దేశవ్యాప్తంగా భర్తలు వదిలేసిన 20 లక్షల మంది గురించి కూడా బిల్లులో ప్రస్తావించి ఉంటే బాగుండేదని వారిలో గుజరాత్‌ లోని మా వదిన కూడా ఉన్నారు" అని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సతీమణిని అన్యాపదేశంగా ఉద్దేశించి అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 



సంక్షిప్తంగా బిల్లు స్వరూపం: 


ట్రిపుల్‌ తలాక్‌ లేదా తలాక్‌–ఈ–బిద్దత్‌ చట్టంగా చెప్పబడుతున్న ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లులో పలు కఠిన నియమ నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ఏ ముస్లిం పురుషుడైనా తక్షణం అమల్లోకి వచ్చే విడాకు ల కోసం భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్‌ తప్ప దేశ మంతటా అమల్లోకి వస్తుంది. 

 

@ మౌఖికంగా గాని రాత పూర్వకంగా కాని లేక అంతర్జాలం వేదికగా అంటే మొబైల్, ఈమెయిల్‌ వంటి ఎలక్ట్రానిక్‌ సమాచార రూపంలో సహా ఏ రూపం లో చెప్పినా ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదు. అలాగే అది చట్ట వ్యతిరేకం కూడా.  


@ బిల్లులో ట్రిపుల్‌ తలాక్‌ ను 'కేసు పెట్టదగిన' లేదా కాగ్నిజిబుల్‌, "నాన్‌-బెయిలబుల్‌ క్రైం" గా పేర్కొన్నారు. భార్యకు తలాక్‌ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు.  


@  మైనర్‌ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లు లో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్‌ నిర్ణయం తీసుకుంటారు.  


@  బిల్లులో తలాక్‌ గా "తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్‌ తలాక్‌ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్‌ పద్ధతుల్ని" నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్‌ తలాక్‌ ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం, ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్‌ చెపితే తక్షణం విడాకులు మంజూరయ్యే  సాంప్రదాయాని చట్టపరంగా తిలోదకాలిచ్చినట్లైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: