లోకేష్ కోసం దుర్గగుడిలో అర్ధరాత్రి పూజలు..! నిజమేనా..?

Vasishta

దుర్గగుడిలో తాంత్రికపూజలు నిజమేనా..? అసలు ఆరోజు అర్ధరాత్రి ఏం జరిగింది..? ఆలయ శుద్ధి జరిగిందా లేక ప్రత్యేక పూజలేమైనా చేశారా.. అనేదానిపై అనేక సందేహాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆలయ సంబంధీకులు ఎన్ని వివరణలు ఇచ్చినా ఆ రోజు జరిగిందేంటో చెప్పడంలో విఫలమవుతున్నారు. పైగా వారి మాటలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.


డిసెంబర్ 26వ తేదీ మంగళవారం అష్టమీ నక్షత్రం.. అద్భుతమైన రోజు.. ఆరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తే శక్తి లభిస్తుందనే నమ్మకం ఉందని పండితులు చెప్తున్నారు. అదే రోజు దుర్గగుడిలో అంతరాలయం మూసేసిన తర్వాత మళ్లీ తెరిచి ఏదో చేశారు. అవి తాంత్రిక పూజలని కొందరు వాదిస్తుంటే.. ఆలయ అధికారులు మాత్రం శుద్ధి చేశామని చెప్తున్నారు. అయితే ఆరోజు అపరిచిత వ్యక్తి సీసీ కెమెరాల్లో కనిపించడం ఏదో జరిగిందనడానికి నిదర్శనంగా నిలిచింది. ఆయన ప్రధానార్చకుడు బద్రినాథ్ అనుచరుడని ఈవో సూర్యకుమారి వాదించారు.


అయితే.. మంత్రి లోకేష్ కోసం ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలోనే ఈ పూజలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అంతేకాక.. ఈవో సూర్యకుమారిపై మొదటి నుంచి పలు వివాదాలు చుట్టుముడుతున్నా తొలగించకపోవడం.. ఈ సంఘటన తర్వాత కూడా ఆమెపై చర్యలు తీసుకోకపోవడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. అటు దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా నిస్సహాయస్థితిలో చర్యలేమీ తీసుకోకుండా శాఖాపరమైన విచారణ జరిపిస్తున్నామనడం జరిగిన ఇష్యూను శాంతించలేకపోయింది.


తాజాగా... ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నే ఈ పూజలన్నింటినీ జరిపించారని.. ఆయనే సూర్యకుమారిని నడిపించారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో.. చంద్రబాబు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఈ విషయంపై ఆరా తీశారు. దీంతో.. బుద్ధా వెంకన్న వెంటనే ఆలయ పాలకమండలి సభ్యులను పిలిచి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే బుద్ధా వెంకన్నే ఈ పని చేశారని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తుండడం.. పాలకమండలి సభ్యులతో భేటీ కావడం.. లాంటి పరిణామాలన్నీ ఇష్యూను ఎలాగోలా మేనేజ్ చేసే ప్రయత్నంలో భాగమేనేమో అనే అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి.


ఓవరాల్ గా దుర్గగుడిలో ఏదో జరిగింది.. అదేంటో అది చేసినవాళ్లకు తప్ప మరెవరికీ తెలీదు. ఈ విషయంపై ఎవరు ఏం మాట్లాడినా అవి ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్ప వాస్తవాలంటనేది ఇంకా తెలియడం లేదు. మరి దీనికి ఎప్పుడు తెరపడుతుందనేది కాలమే నిర్ణయించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: