చరిత్ర సృష్టించిన అమరావతి వైభవం

1.శాసన శాస్త్రములు 2. నాణక శాస్త్రములు 3. పురాతత్త్వ శాస్త్రములు 4. పురాతన స్థల ఖనన శాస్త్రము మరియు పరిశోధనలు మొదలైనవి మాత్రమే కాక ఆ శాస్త్రమునకు సంబంధించిన మరియొక ముఖ్య విషయము. మత విషయముగా కాని, చారిత్రకముగా గాని ఒకప్పుడు ప్రసిద్ధి వహించి ఇప్పుడు దిబ్బలయి పోయిన ప్రాచీన క్షేత్రములను, నగరములను త్రవ్వి పరిశోధించి, అట్టి పరిశోధనలో బయలు పడిన పురాతన నిర్మాణ శిథిలములను బట్టి, వస్తు సామగ్రిని బట్టి, వాటి కాలము ను నిర్ణయించి, ఆ కాలము నాటి జనుల ఆచార వ్యవహారాలను, జీవన విధానమును ఆనాటి నాగరికతను తెలిసికొనుటకు, ఆ నాటి చరిత్రను పునర్నిర్మించుటకు పురాతత్వ శాస్త్రజ్ఞులు ప్రయత్నించు చున్నారు.


ఈ విధముగ చేసిన పురాతన స్థల ఖనన పరిశోధనను అనుసరించియే మన నాగరికత, సంస్థలు, కళలు మొదలైనవాని ప్రారంభమును, వాని ప్రాథమిక దశను తెలుసు  కొనుటకు వీలగుచున్నది.


ఆంధ్ర దేశమునకు క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దము నుండియే ప్రారంభమై  క్రీ.శ. పదిహేడవ శతాబ్దము వరకు సాగిన సుదీర్ఘమైన స్వతంత్ర చరిత్ర కలదు. ఈ రెండు వేల సంవత్సరములలో ఆంధ్ర దేశమున వేరువేరు ప్రాంతములందు రాజ్యములు నిర్మించుకొని పరిపాలనము చేసిన రాజవంశము లనేకము కలవు. ఆంధ్ర దేశమును సంపూర్ణముగ కాకపోయి నా అతి ముఖ్య ప్రాంతాన్ని ఒకే పతాకం క్రిందికి తీసికొనివచ్చి పాలన చేసిన రాజాధిరాజులు, చక్రవర్తులు ఉండేవారు.


ఆంధ్ర దేశమును పరిపాలించిన రాజవంశములు వైదిక ధర్మావలంబకులు, యజ్ఞ యాగాది నిత్య కర్మనిరతులు అయి కూడా పరమత సహనం కలవారై బౌద్ధ, జైనులను కూడ ఆదరించారు. ఈ రెండు వేల సంవత్సరముల కాలములో ప్రసిద్ధి వహించిన పట్టణములు చాల పాడు పడి పోయాయి. కొన్ని పట్టణములు పల్లె లైనాయి. బౌద్ధ జైన మతములు మన దేశమున క్షీణించి పతనమై నశించిపోయిన అనంతరం బౌద్ధ రామములును, జైనవసదులును కాలగమనాన భూగర్భంలో కలసిపోయాయి


చరిత్ర ప్రసిద్ధి వహించిన పురాతన స్థలముల వద్ద పెద్ద పెద్ద  దిబ్బ లిప్పటికిని కాన పడతాయి. ఇటు వంటి దిబ్బలలో కొన్నిటిని పురాతత్వశాఖ వారు త్రవ్వించి పరిశోధ నలు జరిపారు; ఇంక జరుపుచున్నారు. ఇటు వంటి దిబ్బలను త్రవ్వించి పరిశోధించు టవలన,  దేశములో కనిపించే  శాసనములను పరిశోధించుట వలననే మన దేశము యొక్క పూర్వ చరిత్ర క్రమముగా బయట పడుచున్నది.


ఆంధ్ర దేశములో పురాతత్వశాఖ వారు కొన్ని కొన్ని దిబ్బలను, స్థలములను త్రవ్వించి జరిపిన పరిశోధనల వలన బౌద్ధావశేషములకు, జైనావశేషములకు నెలవైన చరిత్ర ప్రసిద్ధములగు ప్రదేశము లనేకము బయట పడి మన దేశములోని బౌద్ధ, జైన మత చరిత్రలు గతం కంటె ఎక్కువగా తెలిసికొనుటకు వీలయినది. ఈ ప్రదేశములలో అమరావతి, నాగార్జునుని కొండ, భట్టిప్రోలు, గంటసాల, జగ్గయ్య పేట, గుమ్మడిదుర్రు, సంకారము, రామతీర్థము, శాలిహుండము ముఖ్య బౌద్ధ స్థలములు ఆంధ్ర దేశమున బౌద్ధము జనాదరణము చూరకొని క్రీ. పూ. 3వ శతాబ్దము మొదలు క్రీ. శ 7వ శతాబ్దము వరకు వాస్తు, శిల్ప, చిత్ర లేఖనము లకు రూపురేఖలు దిద్దినది.


బౌద్ధసంఘములు వేరువేరు కులములకు తెగలకు ఉన్నతాదర్శమును చూపి నైతికము గా జనుల నిత్యజీవితములందు మార్పులు తెచ్చినవి. భౌతికములైన సీమావధులను దాటి మతమును వ్యాపింపజేయుటకయి ఆ కాలమునందలి బౌద్ధభిక్షువు లు అపారమైన  కృషి చేసి ఆంధ్ర నాగరికతకు అభ్యున్నతిని, శోభను, సొంపును సౌందర్యాన్ని అద్ధారు.


బౌద్ధుల పవిత్ర వాస్తు నిర్మాణ శాస్త్రము ను గూర్చిన పరిశోధన భారతీయ పురాతత్వ శాస్త్ర మందు ప్రధాన స్థానమును ఆక్ర మించినది. బౌద్ధులకు పవిత్రమైన కట్టడములలో సంఘారామము, స్తూపము అనునవి ప్రముఖమైనవి.  విహారమను శబ్దము బౌద్ధభిక్షువులు నివసించు మఠములకే కాక, బౌద్ధాలయములకు కూడ వాడబడినట్లు చైనా యాత్రికుడు  యువాన్‌ చాంగ్ రచనల వలన, శ్రీలంక ద్వీపమున ప్రార్థనా మండపములకు నేటికి ఈ నామము చెల్లుచుండుట వలన తెలుస్తుంది.


బౌద్ధ రామము సాధారణముగా చతురస్రమయి, అంతర్భాగమున మండువా విధమున ఖాళీస్థలమును, దీని నావరించుకొని చతుశ్శాలయు, అందు మూడు ప్రక్కల బిక్షుల  నివాసములకై కట్టిన గదులును గల నిర్మాణము.


స్తూపమను పదము బౌద్ధ వస్తు వైన  ఇటుకతో కాని, రాతితో కాని, మట్టితో కాని, అర్ధ గోళాకృతిలో నిర్మించిన సమాధి వంటి నిర్మాణములకు మాత్రమే వాడబడినది. స్తూపము నే బౌద్ధులు చైత్య మనియు వ్యవహరించుచుండిరి. బుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, అర్హతులు, చక్రవర్తులు - వీరికి మాత్రమే స్తూపము నిర్మింప వచ్చును అని బుద్ధుడే శాసించినట్లు “మహా పరి నిర్వాణ సూత్రము” న తెలుపబడి యున్నది. కాని కాలక్రమమున విఖ్యాతులైన బౌద్ధాచార్యులకు గూడ బౌద్ధులు ఈ గౌరవము ఇచ్చినట్లు పురాతత్వశాఖ వారి పరిశోధనల వలన ఋజువౌతుంది.


స్తూపములు త్రివిధములు. అవశేషధాతువులపై కట్టిన స్తూపములకు “ధాతుగర్భములు లేదా శారీరకస్తూపములు” అని, బుద్ధుడు సంచరించిన పవిత్ర క్షేత్రము లందు ధాతు రహితముగా కేవలము స్మారక చిహ్నములుగా కట్టినవానికి “ఉద్దేశిక స్తూపము” లని, ఆచార్యపాదులు ఉపయోగించిన భిక్షాపాత్ర, పాదుకలు మొదలగు పారిభోగిక వస్తువులను పదిలపరచి, ఆ ప్రదేశములపై కట్టిన స్తూపములకు “పారిభోగిక స్తూపములు” అని పేర్లు. భక్తులైన బౌద్ధశిల్పుల సిద్ధహస్తములలో స్తూప నిర్మాణము ఒక కళయై పరిణామ క్రమము  పొంది వాసికెక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: