నువ్వానేనా..! గవర్నర్, గవర్నమెంట్ మధ్య కోల్డ్ వార్ ..!!

Vasishta

కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని, గవర్నర్ నరసింహన్ కు మధ్య గొడవ నడుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాలా బిల్లును గవర్నర్ ఆరు నెలలుగా పట్టించుకోవడం లేదనే ఆక్రోశం ప్రభుత్వంలో ఉంది. అయితే ఎట్టకేలకు దానికి మోక్షం లభించింది. అయితే అసలు వివాదం ఎక్కడ మొదలైంది.. ఎందుకు మనస్ఫర్థలొచ్చాయి?


          నాలా బిల్లు.. అంటే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు ఉద్దేశించినది. దీని ద్వారా పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించేందుకు వీలవుతుంది. కొత్త రాష్ట్రం కావడం, పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తుండడంతో భూముల కొరత ఏర్పడింది. అందుకే నాలా బిల్లును ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చింది. ఆమోదించాలంటూ గవర్నర్ నరసింహన్ కు పంపించింది.


          అయితే గవర్నర్ నరసింహన్ దాన్ని ఆమోదించలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు ఆమెదించి పంపినా గవర్నర్ తిరస్కరించి వెనక్కు పంపేశారు. ప్రభుత్వం కూడా మళ్లీ గవర్నర్ కు పంపించింది. అయితే అప్పటి నుంచి గవర్నర్ దీన్ని నాన్చుతూ వచ్చారు. అయితే ఇటీవలికాలంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ అంశాన్ని లేవనెత్తడంతో బయటికొచ్చింది. దీంతో గవర్నర్ మరోసారి బిల్లుపై సందేహాలు లేవెనెత్తుతూ తిప్పిపంపించారు. వాటికి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పడంతో గవర్నర్ బిల్లును ఆఘమేఘాల మీద ఆమోదించి పంపించారు.


          అసలే కొత్త రాష్ట్రం.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లును తిప్పిపంపడం, తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపడం .. లాంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకింత ఆగ్రహం తెప్పించాయి. బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇది మరో మలుపు తిరిగింది. చివరకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఊరట దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: