టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా రాఘవేంద్రరావు..?

Vasishta

దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావును టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా నియమించారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది అభిమానులైతే ఆయనకు ఏకంగా అభినందనలు తెలుపుతూ ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే ఇందులో వాస్తవమెంత..


చాలాకాలంగా టీటీడీ పాలకమండలిపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని పాలకమండలి గడువు ముగిసి చాలాకాలమైనా ఇప్పటివరకూ ప్రభుత్వం కొత్త పాలకమండలిని నియమించలేదు. తాత్సారం చేస్తూ వస్తోంది. ఛైర్మన్ పదవికోసం పోటీ ఎక్కువ కావడం కూడా ఇందుకు కారణం కావచ్చు. మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్, నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్రయాదవ్, మదనపల్లెకు చెందిన వ్యాపారవేత్త రవిశంకర్, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళిమోహన్ లతో పాటు ఉత్తరభారతానికి చెందిన రవిశంకర్ తదితరుల పేర్లు కూడా ఛైర్మన్ పదవిరేసులో వినిపించాయి.


ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈసారి ప్రజాప్రతినిధులకు ఛాన్స్ లేదని తేల్చేశారు. దీంతో రాయపాటి సాంబశివరావు, మురళిమోహన్ తదితరులకు నిరాశే ఎదురైంది. దీంతో పుట్టా సుధాకర్ యాదవ్, బీదరవిచంద్ర యాదవ్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే పుట్టాసుధాకర్ యాదవ్ క్రైస్తవ సభలకు హాజరైనట్టు విమర్శలొచ్చాయి. అంతేకాక.. ఆయన్ను ఛైర్మన్ గా నియామకానికి ఆర్ఎస్ఎస్ అంగీకరించడం లేదనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.


చంద్రబాబును కలిసిన తర్వాత రాఘవేంద్ర రావును టీటీడీ ఛైర్మన్ గా నియమించబోతున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. గత పాలకమండలిలో సభ్యుడిగా పనిచేసిన అనుభవం రాఘవేంధ్రరావుకు ఉంది. పైగా తిరుమలేశుడిపై అపారమైన భక్తి.. ఆయన పేరును రేసులో ముందుంచాయి. దీంతో ఆయనే ఛైర్మన్ అని కన్ఫామ్ చేసేసుకున్నారు చాలా మంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరి పేరనూ ఇంకా అనౌన్స్ చేయలేదు. రాఘవేంద్రరావు పేరును కూడా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: