కేసీఆర్ - పవన్.. చీకటి ఒప్పందం ఇదేనా...?

Chakravarthi Kalyan
మొత్తానికి ఇన్నాళ్లకు ఓ క్లారిటీ వచ్చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజీకీయాలు చేయబోతున్నారు. ఇన్నాళ్లూ పార్ట్ టైమర్ గా ఉన్న ఆయన ఇక ఫుల్ టైమర్ కాబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పవన్ కల్యాణ్ తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. వారి విజయానికి అండగా ఉన్నారు. ఈసారి పవన్ కల్యాణ్ ఏపీలో పూర్తిస్థాయిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించేశారు. 



కానీ అనూహ్యంగా పవన్ కల్యాణ్ తెలంగాణ నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏ రాజకీయ నాయకుడైనా తీవ్రత ఉన్న దగ్గర నుంచే రాజకీయం ప్రారంభిస్తాడు. ఐతే.. ఈ యాత్రకు ముందు పవన్ కల్యాణ్ కేసీఆర్ తో భేటీ కావడం ఆయన రాజకీయ యాత్రపై అనుమానాలు రేకిత్తిస్తోంది. ఆ రోజు కేసీఆర్ ఓ గంట సేపు వెయిట్ చేయించారు కూడా. ఐనా పవన్ సహనంతో భరించి ఓ గంటసేపు కేసీఆర్ తో చర్చించారు. ఆ తర్వాత బయటకు వచ్చి కేసీఆర్ పాలన ఆహా ఓహో అంటూ పొగిడారు. 



ఇప్పుడు ఇదే తెలంగాణలోని మిగిలిన పక్షాలు విమర్శలు చేసేందుకు ఆస్కారం కల్పిస్తోంది. పవన్ తాజా వైఖరిపై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు.. పవన్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణా  ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలు ఉపసంహరించుకుంటున్నానని చెప్పిన తరువాతే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అసలే మేడారం జాతర సందర్భంగా కొండగట్టు రద్దీ పెరిగింది.. ఈ క్రమంలో పవన్ యాత్రకు ఎలా పర్మిషన్ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.



కేసీఆర్ కి పవన్ కి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మొక్కు తీర్చుకోవడానికి వస్తే అభ్యంతరం లేదనీ.. కానీ రాజకీయ మనుగడ కోసం వస్తే మాత్రం ఊరుకోబోమని తెగేసి చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వని కేసీఆర్ పవన్ కి ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. నేరెళ్ల బాధితులు గురించి మాట్లాడనివాడు, తెలంగాణాలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడని వాడు తెలంగాణాలో ఎలా అడుగుపెడతాడని పవన్ కల్యాణ్ పైనా ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటుని చీల్చడానికే పవన్ కొండగట్టు వస్తున్నాడని అనుమానపడుతున్న కాంగ్రెస్ నేతలు ఆయన్ను మరింత దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: