జగన్..! ఇంకెన్నాళ్లీ తప్పులు..!?

Vasishta

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజీ మిస్ అయినట్లుంది. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామంటూ నేషనల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామనకుండా.. హోదా ఇస్తే పొత్తు పెట్టుకుంటామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి.


విభజనచట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని నీతిఆయోగ్ తేల్చిచెప్పింది. దీంతో కేంద్రం కూడా తాము ఇవ్వలేమని స్పష్టంచేసింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది. ప్రత్యేక ప్యాకేజీతో హోదాను మించిన మేలు జరుగుతుందని నాడు మంత్రిగా ఉన్న నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా భరోసా ఇవ్వడంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు కాస్త సంయమనంతో వ్యవహరించారు. ఏ రూపంలో అయినా రాష్ట్రానికి మేలు జరిగితే చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు.


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని, దాన్ని అంగీకరించిన చంద్రబాబు వైఖరిని వైసీపీ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు లాలూచీ పడ్డారని, రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని వైసీపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తారని జగనే స్వయంగా ప్రకటించారు.


అయితే కాలం మారింది. వైసీపీ మాటల్లో పదును తగ్గింది. కేంద్రంపై వైఖరి మారింది. అంతకాలం బీజేపీని అంటరాని పార్టీగా చూసిన వైసీపీకి ఒక్కసారిగా ఆ పార్టీపై ప్రేమ పుట్టింది. బీజేపీతో దోస్తీకోసం వెతుకులాట ప్రారంభించింది. ఢిల్లీలో ఆ పార్టీ నేతలు బీజేపీతో సఖ్యతకోసం అనేక ప్రయత్నాలు ప్రారంభించారు. పిలవని పేరంటకాలకు కూడా హాజరై తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. అటు బీజేపీ కూడా వైసీపీతో విభేదించకుండా ఎప్పుడు ఏ అవసరమొస్తుందోననే ఉద్దేశంతో కాదనకుండా వస్తోంది. ప్రధానితో జగన్ భేటీ కూడా అయి తమ ప్రతిపాదనలను ఆయన ముందుంచారు.


బీజేపీతో వైసీపీ వైఖరి మారిన తర్వాత స్ట్రాటజీ కూడా మారింది. విభజనచట్టంలోని రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి టీడీపీని దుయ్యబట్టడం మొదలైంది. ఇవ్వాల్సిన కేంద్రాన్ని తప్పుబట్టకుండా రాబట్టుకోవడంలో టీడీపీ వైఫల్యం చెందిందంటూ విమర్శించడం మొదలుపెట్టింది. తప్పులేదు.. అయితే రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రతిపక్షపార్టీగా వైసీపీ ఏం చేసిందనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఇవ్వాల్సిన బీజేపీని తప్పుబట్టకుండా ఆ పార్టీతో అంటకాగుతూ వైసీపీ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తుందనేది ఇంపార్టెంట్.


ఇప్పుడేమో హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమంటూ ఏకంగా జగన్ ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. లోపాయకారీగా బీజేపీతో చేసుకున్న ఒప్పందం మేరకే జగన్ ఇలా ప్రకటించారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇస్తే పొత్తుపెట్టుకుంటా అంటే.. బీజేపీ వైసీపీతో పొత్తుకోసం ఎదురుచూస్తోందా.. అని కూడా అనుకోవాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా తమకు తిరుగేలేదనుకుంటున్న బీజేపీ.. వైసీపీతో పెత్తుకోసం వెంపర్లాడే పరిస్థితి ఏర్పడిందా.? జాతీయపార్టీలకు ఆంధ్రాలో స్థానం లేదనడం ద్వారా బీజేపీనే తమతో పొత్తుకు రావాల్సి ఉంటుందని జగన్ తేల్చిచెప్పారా..? అదే నిజమైతే జగన్ అహాన్ని బీజేపీ అంగీకరిస్తుందా..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. జగన్ వ్యాఖ్యలు బీజేపీతో పొత్తుకు వైసీపీ వెంపర్లాడుతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి.


అయితే రాష్ట్ర ప్రజల దృష్టిలో ఇప్పుడు బీజేపీ ఒక దోషి. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చడంలో బీజేపీ అలసత్వం ప్రదర్శిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వ వాదనను కూడా పెడచెవిన పెడుతోందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ విషయంలో టీడీపీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా బీజేపీపైనే నెపాన్ని నెట్టేస్తోంది. ఇప్పటికి 42 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలను ప్రస్తావించానని, ఇంతకంటే ఇంకేం చేయగలనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తద్వారా చంద్రబాబు ఎంత కృషి చేస్తున్న బీజేపీ పెడచెవిన పెడుతోందనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఇలాంటి సమయంలో రాష్ట్రం దృష్టిలో దోషిగా ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సై అనడం ద్వారా వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లయింది. ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు జరగకుండా జగన్ ను గైడ్ చేస్తే మంచిది. లేకుంటే మున్ముందు ఇబ్బందులు తప్పవేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: