స్వాగతం.. సుస్వాగతం

Narayana Molleti

రాష్ట్రపతి భవన్.. దేశ రాజధానిలో ఉన్న అపురూప కట్టడం. భారత ప్రథమ పౌరుడు.. రాష్ట్రపతి.. నివాసముండే నిలయం. దర్బార్ హాల్ రాజసం.. అశోక హాల్ వైభవం.. మొఘల్ గార్డెన్ సోయగం.. ఇవన్నీ రాష్ట్రపతి భవన్ సొంతం. ఈ అద్భుత ప్రాంతాన్ని ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. వారిలో విదేశీ పర్యటకులూ ఎక్కువ సంఖ్య లోనే ఉన్నారు. అయితే.. ఆ అద్భుత కట్టడాన్ని సందర్శించాలంటూ.. ఇప్పుడు రాష్ట్రపతే స్వయంగా పిలుస్తున్నారు. స్వాగతం.. సుస్వాగతం అంటూ.. ఆహ్వానం పలుకుతున్నారు. ఆ మేరకు ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్టులూ పెట్టారు. ఈ నేపథ్యంలో మన దేశ గణతంత్ర భావానికి ప్రతీకైన “రాష్ట్రపతి భవన్” విశేషాలు మీకోసం..!


‘భారత గణతంత్రానికి నిదర్శనం ఈ నిలయం. ఇది ప్రతి ఒక్క భారతీయుడిది. రాష్ట్రపతిభవన్‌ను సందర్శించాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా. విచ్చేయండి.. సందర్శించండి’.. ఇదీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోషల్ మీడియా వేదికగా పలికిన ఆహ్వానం. కేవలం ఆహ్వానించడమే కాదు.. పర్యాటకులను ఆకట్టకునేలా రాష్ట్రపతి భవన్‌ వీడియోనూ షేర్‌ చేశారు. 40 సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియోలో భవనంలోని దర్బార్‌ హాల్‌, అశోకా హాల్‌ వంటి ప్రముఖ ప్రదేశాలను చూపించారు.


అన్ని దేశాల్లోనూ ఆయా దేశాధినేతలు విధులు నిర్వర్తించడానికి ప్రత్యేక భవనాలుంటాయి. అలాగే మన ప్రథమ పౌరుడు, దేశాధిపతి అయిన రాష్ట్రపతికీ మన రాజధాని ఢిల్లీలో ఓ అద్భుత ఇంద్ర భవనం లాంటి నివాసం ఉంది. అక్కడి నుంచే రాష్ట్రపతి అధికారిక విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ భవనం ప్రపంచంలోని అత్యద్భుత కట్టడాల్లో ఒకటి. విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యక్ష నివాసం ఇదే. మొత్తం 320 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి మొఘల్ గార్డెన్ అదనపు అలంకారం.


1911లో దేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మారినపుడు.. అప్పటి వైస్రాయ్ కోసం ఈ భవనం నిర్మించారు. ఇందుకోసం 4 వేల ఎకరాలు సేకరించారు. అక్కడ ఉండే రైజినా, మాల్చా అనే గ్రామాలను ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని బ్రిటిష్ శిల్పి ఎడ్విన్ ల్యూటన్స్ రూపకల్పన చేశారు. ఈ భవన నిర్మాణం 1912లో ప్రారంభించగా.. 1929 నాటికి పూర్తయింది. మొత్తం 29 వేల మంది శ్రామికులు 17 ఏళ్లపాటు కష్టపడితే ఈ సుందర భవన నిర్మాణం సాకారమైంది. మొఘలాయిల అట్టహాసం. యూరప్ శిల్ప శైలి రాష్ట్రపతి భవన్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.


రాష్ట్రపతి భవన్‌ని స్వాతంత్ర్యానికి ముందు వైస్రాయ్ హౌస్ అని పిలిచేవారు. 1950 జనవరి 26న బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి అయ్యాక వైస్రాయ్ హౌస్ పేరు మార్చి రాష్ట్రపతి భవన్‌గా నామకరణం చేశారు. అంతకుముందు ఈ భవంతిని ప్రెసిడెంట్స్ హౌస్ అని కూడా పిలిచేవారు. రాష్ట్రపతి భవన్ నాలుగు అంతస్తులుంటుంది. మొత్తం 340 గదులున్నాయి. ఇవన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ ఇంటికి బ్రిటన్ నుంచి అతిథులు పెద్ద సంఖ్యలో వస్తుండేవారు. వారు ఉండటానికి అనుకూలంగా వీటిని తీర్చిదిద్దారు. దీని మొత్తం విస్తీర్ణం రెండు లక్షల చదరపు అడుగులు. దీని నిర్మాణానికి అసలు స్టీల్ అనేదే ఉపయోగించ లేదు.


రాష్ట్రపతి భవన్‌లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.. దర్బార్ హాల్, అశోకా హాల్. దర్బార్ హాల్‌ను రంగు రంగుల పాలరాతితో ఎంతో విలాసవంతంగా నిర్మించారు. దర్బార్ హాల్ ఫ్లోరింగ్ కోసం చాక్లెట్ కలర్‌లో ఉండే ఇటాలియన్ పాలరాయిని ఉపయోగించారు. కాలమ్స్ నిర్మాణానికి జైసల్మేర్ పాలరాతిని ఉపయోగించారు. దర్బార్ హాలులో ఐదు వందల మంది కూర్చునే వీలుంది. ఇక్కడే రాష్ట్రపతి కోసం ప్రత్యేక గ్రంథాలయం ఉంది. ఇందులో రెండు వేలకు పైగా అరుదైన పుస్తకాలున్నాయి. వీటన్నింటినీ ఇప్పుడు డిజిటలైజ్ కూడా చేశారు. ఇందులో 31 లక్షలకుపైగా ఫొటోలున్నాయి.


రాష్ట్రపతి భవన్‌లో అత్యంత అందమైనది అశోకా హాలు. పర్షియా శైలిలో రంగు రంగుల పైకప్పు, చెక్క ఫ్లోరింగ్‌తో దీనిని నిర్మించారు. హాలు మొత్తం బంగారం పూత పూసినట్లుంటుంది. అణువణువునా రాజసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అశోకా హాల్‌లోనే రాష్ట్రపతికి చెందిన ఫంక్షన్లు జరుగుతుంటాయి. ప్రమాణ స్వీకారాలు, పద్మ అవార్డుల ప్రదానం, సాహస బాలలకు సత్కారం.. ఇలా ఎన్నో విశిష్ట కార్యక్రమాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన వేదికగా అశోకా హాల్ అలరారుతోంది.

రాష్ట్రపతి డైనింగ్ హాలులో ఒకేసారి 104 మంది కూర్చొని భోజనం చేసేందుకు వీలుగా పొడవైన టేబుల్ ఉంది. బ్రిటిష్ రాజరికానికి ఇదో ప్రతీక. రాష్ట్రపతి భవన్ డోమ్ సరిగ్గా భవనానికి మధ్యలో ఉంది. భారతీయ, బ్రిటిష్ శైలులలో దీనిని నిర్మించారు. భవనానికి దాదాపు రెట్టింపు ఎత్తులో ఉంటుందీ డోమ్. 1929లో డోమ్ నిర్మాణం పూర్తయింది. ఐదు కిలోమీటర్ల దూరం నుంచి చూసినా ఈ డోమ్ స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులలో ఆ డోమ్ అందం మరింత రెట్టింపవుతుంది.


రాష్ట్రపతి భవన్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ.. వాటర్ ఫౌంటైన్లు. మొఘల్ గార్డెన్ లోని మ్యూజిక్ ఫౌంటైన్ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తుంది.2014లో ప్రధాని మోదీ, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. రాష్ట్రపతి భవన్‌లో మ్యూజియాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్, మాజీ రాష్ట్రపతులకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో పొందుపరిచారు. రాష్ట్రపతి భవనంలోని స్తంభాలకు అచ్చం దేవాలయాల్లో ఉన్నట్లే గంటలు పెట్టారు. ఇవి హిందూ, బౌద్ధ, జైన సంస్కృతులకు ప్రతీకగా నిలుస్తాయి.


రాష్ట్రపతికి అందుబాటులో టెన్నిస్, పోలో, క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ కారిడార్ల పొడవే రెండున్నర కిలోమీటర్లు. ఇక్కడ 190 ఎకరాల్లో ఉద్యాన వనాలున్నాయి. భవనం చుట్టుపక్కల ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. రాష్ట్రపతి భవన్ వెనుకాలుండే ఉద్యానవనాన్ని మొఘల్, బ్రిటిష్ శైలిలో నిర్మించారు. దీన్ని మొఘల్ గార్డెన్ అని పిలుస్తారు. ఇందులోని 13 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో రకాల ఆకర్షణీయమైన పుష్పాలున్నాయి. 160 రకాల గులాబీలు ఇక్కడ పూస్తున్నాయి. ఏటా ఫిబ్రవరిలో మొఘల్ గార్డెన్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన ఉద్యానవనాల్లో ఒకటి మొఘల్ గార్డెన్స్. భారత రాష్ట్రపతికి హైదరాబాద్, సిమ్లాలో విడిది భవనాలూ ఉన్నాయి. శీతాకాలంలో హైదరాబాద్ బోల్లారంలో ఉన్న విడిది భవనంలోనూ.. వేసవి కాలంలో సిమ్లాలోని విడిది భవనంలోనూ సేదతీరుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: