తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని పదేపదే మాట్లాడుతున్న పార్టీలు ఎవరికి వారుగా పెత్తనం కోసం ప్రాకులాడుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కీర్తి, ప్రతిష్టలు తమకంటె తమకే రావాలని పలుపార్టీలు ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆవిర్భవించిన తెలంగాణ జెఎసిలో మొదటగా తెలంగాణలోని కొన్ని పార్టీలు కల్సి పనిచేసినప్పటికిని అవి వివిధ కారణాలతో జేఏసి నుండి వెళ్లి పోయాయి. తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్ టిఆర్ఎస్ కు రబ్బర్ స్టాంప్ గా మారిపోయడని పలువురు నాయకులు టిజెఎసిని అప్పట్లో విమర్శించారు. కాగా పాలమూరు ఉపఎన్నికల సందర్భంగా తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ బిజెపి అభ్యర్థికి మద్దతునిచ్చారని ఫలితంగానే అక్కడ బిజెపి అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించాడని టిఆర్ఎస్ మైనార్టీ విభాగం ఆరోపించడంతో పాటు కోదండరామ్ కు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ కు టిజెఎస్ కు మద్యన విభేదాలు వచ్చాయా లేదా మరెప్పుడు వచ్చాయో తెలియదు గాని కెసిఆర్, కోదండరామ్ ల మద్యన వైరుద్యాలు వచ్చాయని అందరు అనుకుంటూనే ఉన్నారు. కాగా ఇది మంచికో, చెడుకో ఎందుకు జరిగిందో గాని తెలంగాణ జెఏసి తెలంగాణ మార్చ్ కు పిలుపు నివ్వగానే తామున్నామంటూ ఒక్కటొక్కటిగా పార్టీలు, నాయకులు ముందుకొస్తున్నారు . తెలంగాణ మార్చ్ ను సెప్టెంబర్ 30న నిర్వహిస్తామని టిజెఎసి ప్రకటించి దాదాపు నెల రోజులు కావస్తున్నప్పటికిని టిఆర్ఎస్ ఈ విషయంలో నోరు మెదపలేదు. కాగా కొంత మంది టిఆర్ఎస్ నాయకులు మాత్రం ఆలోచించి, చర్చించి తెలియజేస్తామని ప్రకటించారు.
అయితే తెలంగాణ మార్చ్ కు సిపిఐ నారాయణ సైతం మద్దతు ప్రకటించారు. కాగా సిపిఐ తల పెట్టిన తెలంగాణ ప్రజాపోరుయాత్రకు తమ మద్దతు ఉంటుందని జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ కోసం సిపిఐ, జెఎసి సమన్వయంతో పనిచేస్తుందని ప్రకటించారు. ఇంతకు ముందే బిజెపి తమ మద్దతు ప్రకటించింది. అయితే తెలంగాణ కోసం తమకంటే తమకే పేరు రావాలని పార్టీల నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా కేంద్రం ఆలోచన చేస్తుందని, తనకు సంకేతాలున్నాయని వారం రోజుల క్రితం ప్రకటించిన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఈనెల 24నుండి మూడు రోజుల పాటు టిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేస్తారని ప్రచారం జరుగుతుంది.
కాగా టిఆర్ఎస్ ఈ సమావేశంలో తెలంగాణ మార్చ్ కు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటుందా లేదా ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా పోరాటం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటుందా అనే విషయాలు తెలాల్సి ఉంది. అయితే తాము తల పెట్టిన తెలంగాణ యాత్రను ఏ శక్తి ఆపలేదని, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కల్సి రావాలని కోదండరామ్ కోరుతుండగా టిఆర్ఎస్ ఇప్పటి వరకు మౌనంగా ఉండడం వెనుక టిజెఎసిని ఒంటరిగా చేసేందుకు టిఆర్ఎస్ ఏదైనా ఆలోచన చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అలా అనుకుందామని అనుకుంటే ఇప్పటికే చాలా మంది నాయకులు,పార్టీలు టిజెఎసికి మద్దతు ప్రకటించాయి. అయితే ఇక నుండి తమకే పేరు రావాలని, పెత్తనం చేయాలనే ఆలోచనలో పలువురు నాయకులు ఆలోచన చేస్తున్నట్లు తెల్సింది. టిజెఎసికి, టిఆర్ఎస్ కు మద్యన పెరిగిన విభేదాల కారణంగా టిఆర్ఎస్, టిజెఎసిలో ఉన్నటువంటి క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది.
మరింత సమాచారం తెలుసుకోండి: