31న ఆకాశం అంతా వెన్నెలే! మన మూన్ "వన్స్ ఇన్ ఏ బ్లూమూన్" గా వెన్నెల చిందుతాడు

అరుదైన సంఘటన ఏదైనా ఉంటే "వన్స్‌ ఇన్‌ ఏ బ్లూమూన్‌" అంటూ సామెతగా చెపుతాం. అయితే ఈ నెల అంటే జనవరి చివరిరోజున మనం నిజంగా "వన్స్‌ ఇన్‌ ఏ బ్లూమూన్‌" అనుభవాన్ని పొందబోతున్నాం! ముఖ్యంగా తెలుగువాళ్ళకు మేనమామ లాగా చందమామ కూడా ప్రత్యేకమే. అయితే ఆ అభినవ మేనమామను మధురంగా అద్భుతంగా మహోన్నతంగా భారీ పరిమాణంలో అత్యంత ప్రకాశవంతంగా ఈనెల 31న మనం ఆ వింతను చూడబోతున్నాం. మిసిమి ఎరుపు వర్ణంలో, మామూలు బింబం కంటే పెద్దగా అంతకంటే ప్రకాశవంతంగా "సూపర్‌-మూన్‌" దర్శనమిస్తుందట. 151 ఏళ్ల తర్వాత జరగబోయే అపూర్వ సంఘటన ఇది. 

సాధారణ వెన్నెల రాత్రి కంటే పున్నమి వెన్నెల రేయి మనసును మదురోహలతో పులకరింతల పలవరింతలతో పలకరించ బోతుంది. కార్తీక పౌర్ణమి రాత్రి ఆ అనుభవం మరింత కాంతులీనుతుంది. మామూలు చందమామను చూస్తేనే అలా ఉంటే, ఇక, ఆ నింగి అంతా విరబూసే ఈ సూపర్‌మూన్‌ మరెంతో ఎన్నోరెట్లు ప్రకాశవంతంగా నూతన స్వర్ణవర్ణ శోయగాలతో కను విందు చేస్తుంటే ఆ అద్భుతాన్ని వీక్షణానికి మరి కొన్ని కన్నులుంటే బాగుంటుందని పిస్తుంది. సుదూర తీరాన్ని మరింత దగ్గరగా చూడగలిగే "బైనాక్యులర్స్" ను మన కన్నులకు అనుసంధించాలనిపించదా! అప్పుడు మన నయనాలకు వింతైన జాబిల్లి దర్శనం ఎంతో అనిర్వచనీయం. 


సాధారణ పౌర్ణమినాడు చంద్రుడు మామూలు పరిమాణంకన్నా 14శాతం పెద్దగా, 30శాతం ఎక్కువ దేదీప్యమానంగా ప్రకాశ వంతంగా కనిపిస్తే దాన్ని సూపర్‌ మూన్‌ అంటారు. ఇక ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తే రెండో పౌర్ణమినాడు కనిపించే చంద్రుడిని "బ్లూమూన్‌" గా పిలుస్తారు. ఈ బ్లూమూన్‌-రెండున్నర సంవత్సరాల కొకసారివస్తుంది.  అందుకే, ఈ అరుదైన సందర్భాన్ని గురించి చెప్పేటప్పుడు "వన్స్‌ ఇన్‌ ఏ బ్లూమూన్‌" అంటు ఉదహరిస్థాం.


ఇక సూపర్‌ మూన్‌ ఉన్నపుడు గ్రహణంవస్తే చంద్రుడు ఎరుపురంగులోకి అంటే బ్లడ్‌మూన్‌ గా మారతాడు. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు "భూ" నీడ లోకి చేరి - సూర్యకాంతి భూమికి చేరి, తర్వాత చంద్రుడి మీద పరావర్తనం చెంది చంద మామ రక్త వర్ణంలో శోభిస్తూ మనకు దర్శనమిస్తాడు. సూపర్‌ మూన్‌లు తెలుపు లేదా నారింజ లేదా స్వర్ణ వర్ణ సోభితమై వెలుగు లు చిందుతాయి. గత నెల మూడో తేదీ, ఈనెల రెండో తేదీన కనిపించినవి అలాంటివే. ఒక్కోసారి ముదురు గోధుమవర్ణంలోనూ బూడిదవర్ణంలోనూ కూడా కనిపించే అవకాశం ఉంది. 

అయితే, ఈ నెల 31న దర్శనమిచ్చే సూపర్‌మూన్‌, "బ్లూమూన్‌, బ్లడ్‌ మూన్‌" గా ఒకే సారి కనిపించడమే విశేషం. 1866 తర్వాత ఇలాంటి చందమామ కనిపించడం ఇదే తొలిసారట. మళ్లీ పదేళ్లతర్వాతగానీ ఇలాంటి చందమామను చూసే అవకాశం లేదని "నాసా" ప్రకటించడంతో, ఇప్పుడు ప్రపంచ మంతా సింధూరవర్ణ నెలరేడు పైనే పడింది. 


భారత్‌లో సాయంత్రం 6:21 నుంచి 7:37 మధ్య ఈ బ్లడ్‌ మూన్‌ రంగు మార్చుకుని మరింత మెరుపుతో భారీ పరిమాణంలో దర్శనమిచ్చే చందమామను చూడ్డానికి సిద్ధ మౌదాం! ప్రపంచ వ్యాప్త ఔత్సాహికులు ఎక్కడైతే "ఎర్రటి చంద్రుడు" నయనా నందకరంగా కనిపిస్తాడో — అద్భుతంగా కనిపిస్తాడో గ్రహించి అక్కడికే చేరుకుంటారు. వాతావరణంలోని మార్పులు, వ్యాపించే ధూళి వల్ల కొన్ని చోట్ల రంగు మార్చుకున్న చందమామ "మనొహరుడు" ఔతాడు.


Note: నిజానికి చంద్రుడి పరిమాణం ఎప్పుడూ మారదు అలాగే ఉంటుంది. చంద్రుడు పరిభ్రమించేటప్పుడు చంద్ర గ్రహం భూమికి దగ్గర కక్ష్య లోకి వస్తుంటుంది. అలా వచ్చినపుడు దగ్గర కక్ష్య వలన మనకు పెద్దగా కనిపిస్తుంది. సాధారణంగా భూమికి 238900 మైళ్ల దూరంలో ఉండే చంద్రుడు పౌర్ణమి నాడు 224000 మైళ్ల కన్నా తక్కువ దూరం లోకి వస్తే దగ్గరగా చూడటం వలన  పరిమాణం  పెరిగినట్లు అనిపించి సూపర్‌-మూన్‌ అనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: