మేడారం జాత‌ర‌లో పొలిటిక‌ల్ వార్‌

VUYYURU SUBHASH
ఆ నాలుగు రోజులు... నలు దిక్కులు ఏకమై పురా ఆత్మల స్మరణలో పులకించిపోతాయి. కోటిమందికిపైగా ఒక్కచోటుకొచ్చి త్యగాల వనంలో ప్రణమిల్లుతారు. ఆదివాసీల ఆరాధ్యదైవాలు.. ధిక్కార స్వరాలు.. స్వాభిమాన ప్రతీకలైన సమ్మక్క- సారక్క తల్లుల చెంతలో తరిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క- సారక్క మహాజాతరకు ఈసారి ఓ ప్రత్యకత ఏర్పడింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫిబ్రవరి రెండో తేదీన మేడారం జాతరకు వస్తున్నారు. ఆయనతోపాటు కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ఎం ఓరామ్, సీఎం కేసీఆర్ కూడా వస్తున్నారు. 


ఈ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సమ్మక్క- సారక్క తల్లులను దర్శించుకున్నారు. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతర రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్నేళ్లుగా మేడారం మహాజాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఈ ప్రాంత ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జాతరకు పలువురు కేంద్ర మంత్రులు కూడా వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 


ఎలాగైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జాతర జాతీయ పండుగ గుర్తింపు క్రెడిట్ ను సొంతం చేసుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఆపార్టీ నేతలు. మరోవైపు మేడారం జాతరను గులాబీ జాతరగా మారుస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం పై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వనదేవతల దర్శనానికి వస్తుండడం ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా వుండగా ఆదివాసీ జాతరలో హైందవరాగం వినబడుతోందని, ఆదివాసీల సంస్కృతిని దెబ్బతింటోందని పలువురు విశ్లేషకులు, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


ఇక జాత‌ర సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మ‌హారాష్ట్ర‌లోని సిర్వోంచ నుంచి, ఇటు ఛ‌త్తీస్‌ఘ‌డ్ నుంచి కూడా బ‌స్సులు ఏర్పాటు చేస్తోంది. ఏదేమైనా జాతీయ పండుగగా గుర్తింపు సాధించేందుకు పోటీ పడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ లో పై చేయి ఏ పార్టీదో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: