షాకింగ్ న్యూస్- టీడీపీ నేత "గాలి" ఆకస్మిక మృతి..

Chakravarthi Kalyan
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆకస్మికంగా  కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.ఆయన మూడు రోజుల క్రితం తీవ్రజ్వరంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు ఇటీవల గుండె ఆపరేషన్ కూడా అయినట్టు తెలుస్తోంది. 


గాలి ముద్దుకృష్ణమ నాయుడు  తెలుగుదేశంలో చాలా సీనియర్ నాయకుడు. సైన్స్ లెక్చరర్ గా ప్రభుత్వోద్వోగం చేస్తున్న ఆయన 1983లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని నగిరి నియోజకవర్గం నుంచి ఆయన ఇటీవల ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ నేత రోజా చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.   


దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 సంవత్సరంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు జన్మించారు. ఆయన బీఎస్సీ, ఎంఏ చదివారు. న్యాయవాద డిగ్రీ పట్టా కూడా అందుకున్నారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి ఆయన రికార్డు నెలకొల్పారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తొలి విడతలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 



ఆ తర్వాత 1987 అటవీశాఖ మంత్రిగానూ.. 1994లో ఉన్నత విద్యాశాఖా మంత్రిగానూ పనిచేశారు. తెలుగుదేశం పార్టీ చీలిక సమయంలో ఆయన కొంతకాలం లక్ష్మీపార్వతి వర్గంగా ఉన్నారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో మళ్లీ టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: