ఆ సంఘటన నాతో కన్నీళ్లు పెట్టించింది..: పవన్ కల్యాణ్

Vasishta

జనసేన పార్టీ పుట్టుక ఎలా జరిగిందో చాలా మందికి తెలుసు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిన తర్వాత కూడా పవన్ తన రాజకీయాలను వదల్లేదు. అన్యాయం ఎక్కడ జరిగినా ఏదో ఒక రూపంలో ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే అసలు జనసేన పుట్టుకకు దారితీసిన పరిస్థితులను ఆయన ఏనాడూ నేరుగా బయటపెట్టలేదు. అయితే ఇప్పుడు చెప్పారు.


ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ ఘోషిస్తున్నాయి. బీజేపీ – టీడీపీ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. మరోవైపు విపక్షాలన్నీ కూడా ఏకమై వివిధ రూపాల్లో తమ ఆందోళనను, నిరసనను తెలియజేస్తున్నాయి. ఇదే క్రమంలో జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ కూడా డిమాండ్ చేశారు. కేంద్రం – రాష్ట్రం మధ్య లెక్కల తేడాకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దాని తొలి సమావేశం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది.


ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై తన మనసులోని మాట బయటపెట్టారు. పాలకులు చేసే తప్పులకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. పార్టీలన్నీ రాజకీయలబ్ది కోసమే పోరాటం చేస్తున్నాయి కానీ సమస్య మూలాల్లోకి వెళ్లి దాని పరిష్కారం కోసం ప్రయత్నించట్లేదని పవన్ ఆరోపించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన అన్యాయాన్ని మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడే గాంధీనగర్ వెళ్లి వివరించానన్నారు పవన్. నాడు ప్రధాని న్యాయం చేస్తానని హామీ ఇచ్చినందుకే బీజేపీకి మద్దతుగా నిలిచినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు మాట తప్పడం వల్ల జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. పాలకులు మాటిచ్చి తప్పినప్పుడు వారు చేసే చట్టాలను ప్రజలెందుకు గౌరవించాలని ప్రశ్నించారు.


సమావేశంలో ఉద్వేగానికి లోనైన పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ పెట్టడానికి వెనకున్న ఓ సంఘటనను వెల్లడించారు. 50 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చి స్థిరపడిన ఓ కుటుంబం తన ఫాంహౌస్ లో నివసిస్తోందన్నారు. ఆ కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోతే.. అంత్రక్రియలు చేయడానికి స్మశానికి తీసుకెళ్తే.. మీరు ఆంధ్రావాళ్లు అని వెనక్కి తిప్పి పంపారని పవన్ చెప్పారు. చివరకు తన స్నేహితుల ద్వారా వారి అంత్యక్రియలు చేయించానన్నారు. అసలు వాళ్లు చేసిన తప్పేంటి..? పాలకులు చేసిన తప్పులకు అలాంటి సామాన్య ప్రజలు శిక్ష అనుభవించాలా..? ఇలాంటి సామాన్యులు ప్రతి బస్తీలోనూ ఉంటారు.. అని పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయమే తనతో పార్టీ పెట్టేలా చేసిందన్నారు పవన్ కల్యాణ్. “ప్రజాస్వామ్యంలో ఓటేసిన వ్యక్తికి ప్రశ్నించే హక్కుంటుంది. అయినా వారి ఘోషను వినేవాళ్లే లేరు. వారి సమస్యను పట్టించుకునేవారే లేరు. అలాంటప్పుడే వాళ్లంతా తాము ద్వితీయశ్రేణి పౌరులమా.. అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోతారు. ఇది చాలా ప్రమాదకరం.. ఉత్తరాది, దక్షిణాది నినాదాలు రావడానికి కూడా ఇదే రీజన్.” అంటూ పవన్ చేసిన ప్రసంగం ఉద్వేగంగా సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: