రూటు మార్చిన బాబు.. జగన్‌తో చేతులు కలిపినట్టేనా..?

Chakravarthi Kalyan

ఇన్నాళ్లూ ప్రత్యేక ప్యాకేజీ పాట పాడిన చంద్రబాబు ఇప్పుడు రూటు మారుస్తున్నారా.. పేరు ఏదైతేనేం.. మనకు రావాల్సిన నిధులు వస్తే చాలు అంటూ ఇన్నాళ్లూ చెప్పిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా రాగం అందుకున్నారు. మిగిలిన రాష్ట్రాలకు ఇస్తున్న ప్రత్యేక హోదా మాకు ఎందుకు ఇవ్వరు అంటూ నిలదీస్తున్నారు. అంటే ఇన్నాళ్లూ జగన్ ఎత్తుకున్న నినాదాన్నే చంద్రబాబు ఎత్తుకున్నారన్నమాట.


కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉన్న అన్ని అవకాశాలను అధినేత చంద్రబాబు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో రాజుకున్న రాజకీయ వేడిని దృష్టిలో పెట్టుకుని ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లేలా కార్యాచరణను ముఖ్యమంత్రి ముమ్మరం చేస్తున్నారు. ఇందుకనుగుణంగానే అఖిల సంఘాల సమావేశానికి ఆయన శ్రీకారం చుట్టారు.


కేంద్రంపై ఏ మాత్రం పట్టు సడలించకూడదన్నది తెలుగుదేశం అధినేత ఆలోచనగా తెలుస్తోంది. అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలే కాదు.. ప్రజా సంఘాలు కూడా కేంద్రం తీరును తప్పుపడుతున్నాయనే సంకేతాలు బీజేపీ అధినాయకత్వానికి అర్థమయ్యే రీతిలో పంపాలనేది తెలుగుదేశం వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను.. బీజేపీ రాజకీయ కోణంలోనే చూస్తోందని.. ఇక ఏ మాత్రం నిధులు ఇవ్వదనే అభిప్రాయానికి టీడీపీ వచ్చింది.


కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదం అందుకోవడం ద్వారా చంద్రబాబు తన విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది. ఇన్నాళ్లూ ప్రతిపక్షం వాదనను కొట్టిపారేసి ఇప్పడు తానూ అదే రాగం అందుకోవడం పార్టీ ప్రతిష్టను మంటకలుపుతుందని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరి చంద్రబాబు, జగన్ ఏకమై హోదా పోరాటం సాగిస్తారా.. లేదా మళ్లీ రాజకీయ ఎత్తుగడలతోనే కాలం గడుపుతారా చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: