ఎడిటోరియల్ :అందుకే కేంద్రం అంటే చంద్రబాబుకు భయం! ఇదే రాష్ట్రం కొంప ముంచింది

ఒక ప్రయోజన సాధనకై యుద్ధం ప్రారంభించే ముందు మన చతురంగ బలాలను ఆయుధ సంపత్తిని సరిచేసుకొని అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకొనే యుద్ధానికి సిద్ధమవ్వాలి. అది సమరమైనా ఉద్యమమైనా అప్పుడే విజయం మన చేరువలోకి వస్తుంది.


ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే రాష్ట్రం నుండి ఇంత పెద్దయెత్తున యాగీ చెలరేగుతూ  ఉద్యమరూపం సంతరించుకుంటున్నా కేంద్రం ఎందుకు కదలి రావటం లేదు? చలనం ఎందుకు లేదు? ఇక్కడ చర్చించాల్సిన ప్రధాన అంశం. రాజ కీయంగా మన రాష్ట్రం కెంద్రంలోని అధికారపార్టీకి మిత్రబేధం ఏర్పడ్డ దరిమిలా దూరమైనా వారికి పెద్ద నష్టంలేదు. కాని మనకు ప్రయో జనాల సాధన ముఖ్యం. ఏదైనా ఒక సమస్యను కదిలిస్తే అందులో దాగున్న వంద కొత్త సమస్యలు బయటికి వస్తాయి. వాటిని బేరీజు వేసుకోవాలి.


ఉదాహరణకు రాజధాని నిర్మాణం తీసుకుంటే "రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారం" కాదు. రాజధానికి రాజ్యాంగ పరంగా రాజ్యాంగ  వ్యవస్థలతో పాటు కొన్ని విద్య ఆరోగ్య పాలనా భవనాలు నిర్మాణం జరగాలి.   అంతేకాని సింగపూర్ ను తెచ్చి అక్కడపెట్టక్కర్లేదు. అలా జరిగితే కొందరు అధికార పక్షంలోని వారికి మాత్రమే ప్రయొజనం కలుగుతుంది. రాజధాని మౌలిక సదుపాయాల పునాదులపై నగరం దినదిన ప్రవర్ధమానమౌతుంది. కొన్ని ఇతర వ్యవస్థలు, అవసరమైన చోట్ల విశ్వ విద్యాలయాలు ఏర్పాటు చెయ్యటం అవసరం. 


ముఖ్యంగా కావలసినవి దేశవ్యాప్తంగా రహదారుల రవాణా వ్యవస్థల అనుసంధానం. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయవలసినవి తప్ప అనధికార భవనాల నిర్మాణాలకు ఇరు ప్రభుత్వాలకు భాద్యత ఉండదు.  అందుకే కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం కోరవలసింది ఇంతకు మించి ఏమీ ఉండదు.


కాని రాజధాని కోసం ₹ 40000 కోట్ల రూపాయిలు కేటాయించవలసిన అవసరమేముంది? అనేది కేంద్రం ప్రశ్న.


హైదరాబాద్ లోని సైబరాబాద్ ను అభివృద్ది చేశానన్న చంద్రబాబు చేసింది మాత్రం ఏముంది మంచి మౌలిక సదుపాయాలు మాత్రం ఇచ్చారు. అన్ని వ్యాపారాలకు కావలసింది విశ్వాసం నమ్మకం వాతావరణం. అవి హైదరాబాద్ లో ఒక్క రాత్రికి రాత్రే  ఏర్పాటు కాలేదు. దాని అభివృద్ధికి మూడు దశాబ్ధాలు పట్టింది. అత్యంత వేగం అందుకుంది మాత్రం ఒక దశాబ్ధంన్నర క్రితం నుండే.  ప్రపంచంలో ఏ నగరమూ వ్యాపారాలకోసం ప్రభుత్వాలు నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవన్నది మనం గమనించాలి.


అద్భుతమైన రాజధాని కోరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమరావతి అభివృద్ధి చేసుకునే వరకు హైదరాబాద్ ను 10నుంచి 15సంవత్సరాలు రాజధానిగా వినియోగించుకోనే "కోట్లాదిరూపాయిల విలువైన విభజన హామీ"ని ఎందుకు కాలరాసుకున్నారు?  హైదరాబాద్ ను హాయిగా ఉపయోగించుకుంటూ అమరావతి సంపూర్ణ మౌలిక సదుపాయాలద్వారా అనుసంధానం అయ్యే వరకు నిరీక్షించటంలో కోట్ల రూపాయల ఆదాతో పాటు, హైదరాబాద్ తో సంబంధం ఉన్న అనేక అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చు కదా!


నూతన విదేశీ పెట్టుబడుల సాధనకు పరిశ్రమల స్థాపనకు ఉన్న ఈ సదుపాయాన్ని వదులు కోవటం అవివేకం మాత్రమే కాదు  అత్యంత నష్టదాయకం కూడా.  దీన్ని ఎందుకు వదులుకున్నారు? విభజన ఫలాలను ఒక ప్రక్క ఎడమకాలితో తన్నేస్తూ మరోప్రక్క కేంద్రం అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదంటూ వ్యధ చెందటంలోని అంతరార్ధం ఏమిటి "నిజమైన ప్రయోజనాలు కావాలా? రాజకీయ ప్రయోజనాలు కావాలా?"


నిజమైన విభజనఫలాలు కోరుతూ అభివృద్ది ఆకాంక్షించే ప్రజలు, చేతిలో ఉన్న ప్రయోజనాలని వదిలెయ్యటాన్ని  గురించి చంద్రబాబును ప్రశ్నించ రెందుకు? విభజన ఫలాల సాధనకు కృషిచేసే చలసాని శ్రీనివాసుగారు శివాజీ గారు, చివరకు ప్రశ్నించటానికే రాజకీయ రంగ ప్రవేశం చేసి అధికార పార్టీకి పాలనాపరంగా ఇబ్బందులు కలుగరాదని ప్రశ్నించని జనసేన పార్టీ నాయకుడు, కనీసం ఎందుకీ ప్రశ్న లేవనెత్తటం లేదు? 


*దీని కారణం ఏమిటి?

*దీని వెనకున్న మహత్తర రాజకీయం ఏమిటి?

*సామాజిక కోణం ఏమిటి?

*భౌగోళిక రాజకీయ మేమైనా ఉందా?

*వ్యక్తిగత వర్గపర ప్రయోజనాలు ఆధిపత్యం వహించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా?

*ఒక రాజధానిని నిర్మించగల నిర్మాణ నిపుణులు భారతదేశం లోనే లేరా?

*ఒక సినిమా దర్శకుడు ఇవ్వగల నిర్మాణ ఆకృతులు ఆ శాస్త్ర నైపుణ్యం గలిగిన భారతీయులు ఇవ్వలేనిదా?

*ఎందుకు ఒక్క నగర ఆకృతుల కోసమే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగల సామర్ధ్యం నూతనంగా ఏర్పడ్ద రాష్ట్రానికి ఎక్కడిది?

*అత్యంత సారవంతమైన భూములను నగర నిర్మాణం కోసం వృధా చేయవలసిన అగత్యంపై ఎందుకు యాగీ చేయలేదు?

*దీని నేపధ్యంలోని రాజకీయ ఆర్ధిక సామాజిక మానసిక కోణాలను బట్టబయలు ఎందుకు చేయలేదు? ఇందులో వర్గ పక్షపాతం ఉందని అంటున్నారు?

*ఈ రాజధాని నగరం ప్రజలంతా ఉన్నత మద్య నిమ్న స్థాయి ఆర్ధిక పరిస్థితులున్న వివిధ వర్గాలు సమానంగా కలసి జీవించే వెసులుబాటు ఉందా?

*ఒక్క ఉన్నత వ్యాపార వర్గాల కోసం రాజధాని నిర్మించటం నేరం. రజధాని అందరిది అన్న భరోసా ఉందాలి అది ఉందా?


వీటికి చంద్రబాబు నుండి సమాధానాలు రాబట్టటం, నిధుల దుర్వినియోగం, పోలవరంలో దాగున్న అవినీతి, కాంట్రాక్టులు చట్ట సమ్మతంగా ఇచ్చారా?


ఇవన్నీ విభజనఫలాల సరైన వినియోగానికి సంభందించినవే. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఋణం రెండు లక్షల కోట్ల రూపాయలకు సమకూర్చిన ఆస్తుల లెక్కలను కూడా చంద్రబాబును ప్రశ్నించాలి.  కొత్త రాష్ట్రం ఇంత ఋణం చేయవలసిన అగత్యమేమిటి? ఇంకా కేంద్రాన్ని నిధుల కోసం వెంపర్లాడటం ఎందుకు? దానికి బదులు ఋణాన్ని సహాయంగా మార్చే ఏర్పాటు చేయమని అడగొచ్చుకదా?

 

చంద్రబాబు గారు నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. మంగళవారం సాయంత్రం చంద్ర బాబు నివాసంలోని ప్రజాదర్బారు హాల్లో నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.


హోదాతో వచ్చే ప్రయోజనాలను ప్యాకేజీ పేరుతో ఇస్తామంటేనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పు కున్నా మని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పారు. ప్యాకేజీ పేరుతో అయినా, ప్రత్యేక హోదా పేరుతో అయినా, ఏపీ జరిగిన నష్టాన్నీ భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కొత్తగా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని కేంద్రం వివరిస్తే, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఇప్పుడు వేరే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎలా ఇస్తోందని ఆయన ప్రశ్నించారు.


ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి "పెనం మీద నుంచి పొయ్యి" లో పడినట్లైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది కదా! అని బీజేపీ న్యాయం చేస్తుంది అనుకుంటే ఆ పార్టీ కూడా అలానే ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన దానిలో నరెంద్ర మోడీ పాత్రకు చంద్రబాబు నాయుడు పాత్ర ఏమాత్రం తక్కువ కాదు. అటు టిడిపి - బిజెపి రెండూ తోడు దొంగలే అనాలి. ఐతే వారిలో దొంగ కాని వారెవరో వారే ఋజువు చేసు కోవాలి.


గత నాలుగేళ్ళుగా చంద్రబాబు పనితీరు పూర్తిగా సంశయాస్పదంగానే ఉంటూ వస్తుంది. ప్రజలకు ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించారు. ఎన్నికల మానిఫెస్టో ప్రకారంగాని, సందర్భాను సారం వీలువెంట వివిధ సందర్భాల్లో చంద్రబాబు ప్రజలకు చేసిన వాగ్ధానాలు వివరించటానికి ప్రయత్నిస్తే కొన్ని వాల్యూములకు వాల్యూము ల పేజీలు నిండుతాయి.


చంద్రబాబు చేసిన వాగ్ధానాలు ఆయన నెరవేర్చనట్లే, బాజపావాళ్ళు చేసిన వాగ్ధానాలు వారు నేరవేర్చని పరిస్థితులు నెలకొనే లా చేసింది టిడిపి నాయకత్వం కాదా! ఇప్పుడు వాళ్ళను ప్రశ్నించటానికి ముందు చంద్రబాబు క్రింది ప్రశ్నలకు ప్రజాన్యాయస్థానంలో సమాధానాలు అటు ప్రజలకు ఇటు బాజపాకు చెప్పవలసి ఉంటుంది.



*హైదరాబాద్ రాజధానిని ఎందుకు వదిలేశారు?

*ప్రతిపక్ష ఎమెల్యే, ఎంపిలను మీ పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారు? దీని నేపథ్యంలో వారికి సమకూర్చిన ఏర్పాట్లు, వారిని సంతృప్తి పరచటానికి వారికి పంచటానికి ఫణంగా పెట్టిన ప్రజా ప్రయోజనాలు వారికి దారాదత్తం చేసిన సంపద "విలువ" ఎంత?

 *ఆ సొమ్ముతో రాజధాని నిర్మాణం, ప్రజా ప్రయోజన పథకాలు కెంద్రంతో సంభంధం లేకుండా ఎందుకు చేయలేదు?

*నంద్యాల ఎన్నికల్లో మీరు పెట్టిన ఖర్చుతో ఒక ప్రధాన రహదారిని నిర్మించి ఉండవచ్చు గదా?

*తెలంగాణా ఎమెల్సి “స్టీఫెన్-సన్ ప్రాతినిధ్యాన్ని కొనగోలు చేయటానికి ప్రయత్నించటం నిజం” కాదా?

*అసలు విభజన ఫలాలైన ప్రజా ప్రయోజనాలను అంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని వది లెయ్యటం వెనుక, ప్రత్యేక హోదాను ప్రత్యేక పాకేజిగా మార్చటం వెనుక చంద్రబాబు ఆయన పార్టీ సహచర నాయకులు సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు తదితరులు వేసిన ప్రణాళిక ఎమిటి?

*నేరాభియోగాలున్నపై వ్యక్తుల ప్రయోజనాలకు ప్రత్యేక హక్కును, స్టీఫెన్ సన్ కాష్ ఫర్ ఓట్ ఫైల్ ఓపెన్ కాకుండా కాపాడుకోవటం కోసం, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరాన్ని అర్ధాంతరంగా వదిలేయటం, చివరకు ప్రత్యేక పాకేజిని కూడా డిమాండ్ చేసి తీసుకు రాలేని అతి దయనీయ స్థితికి చంద్రబాబు పడిపోయారు అనే మాటలు నిజం కాదా?  

*నాలుగు దశాబ్ధాల చంద్రబాబు రాజకీయ జీవితం అనుభవం దీని సాధనకు చాలదా? ఇందుకు ఆయన రాజ్యాంగ వ్యవస్థలను ఎందుకు వినియోగించుకోలేక పోతు న్నారు ? దానికి  ఆయనలోని ప్రజలకు తెలియని కేంద్రానికి తెలిసిన బలహీనత కారణం కాడా?

*పోలవరం విషయం లో ట్రాన్స్-ట్రాయ్ తో ప్రభుత్వపెద్దలు లాలూచి ప డ్డారని దానికి సంభందించిన వివరాలు కేంద్ర దగ్గర ఉండటమే ,కేంద్రంపై "అవిశ్వాసాన్ని ప్రకటించటం" లో చంద్రబాబు వెనకడుగు వేయటానికి కారణ మంటున్నారు? ఇది వాస్తవమా? కాదా?

*ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు ఇబ్బందులకు గురిచేసి కోట్లాది రూపాయలు, పలు కాంట్రాక్టులు, రాజకీయ అవకాశాలు ఆశ చూపటం పార్టీ మార్పించి ప్రజా స్వామ్యాన్ని హృదయవిధారకంగా ఖూనీ తీరు హర్షనీయం కాదు కదా?

*ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ప్రభుత్వపెద్దల స్వార్ధానికి తాకట్టు పెట్టిన చరిత్ర సమస్తం ‘కేంద్రం ఫింగర్ టిప్స్’ లో ఉందనీ,  అందుకే టిడిపి ఏమీ చేయలేని అసమర్ధస్థితిలో ఉందని  అందుకే “పవన్ కళ్యాణ్ జీఫెఫ్సి నీడలో - ప్రజల దృష్టిని బాజపా పైకి నెట్టేసి” బ్రతికేస్తున్నారనే ప్రజల భావనకు మీ సమాధానమేమిటి?

*టిడిపి పరిపాలన సమస్థం మీ స్వప్రయోజన సాధనార్ధం అని నిరూపించటానికి కాల్-మని, సాంద్, కల్తి, రెడ్ సాండల్ మొదలైన మాఫియాలపై మీ చర్యలు ఏమీ లేకపోవటమే నంటున్నారు.

*నాలుగేళ్ళ టిడిపి పాలన సమస్తం ప్రతిపక్ష ఎమెల్యేలను, ఎంపిలను కొనడానికి- సుపుత్రుణ్ణి మంత్రిని చేయటానికి-నేరాభియోగాలను మానేజ్ చేసుకోవటానికే సరిపోయిందంటారు ?


ఇవన్నీ బాజపా సాధికారికంగా వెల్లడి చేస్తుందనే భయమే-ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కైన ప్రత్యేక హోదాకు అడ్డుకట్టవేసిందని దేశ రాజధాని లో వినిపిస్తున్నమాట? ప్రత్యేక హోదా సాధన కమిటీ కాని, పవన్ కళ్యాణ్ కాని, ఉండవల్లి కానీ తొలుత యుద్ధం చేయాల్సింది ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారితో. ఆ తరవాత ఈయన ఎందుకు కేంద్రానికి భయపదుతున్నారో ప్రజలకు తెలిపి ఆపై ప్రజాఉద్యమం ద్వారా కేంద్రాన్ని నేలకుదింపొచ్చు. ప్రజలు తొలుతయుద్ధం చేయాల్సింది చంద్రబాబు మీద! అప్పుడు మోడీ కొండ మీద కోతి లాగా తనకైతానే దిగి వస్తాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: