ఏపీలో బీజేపీకి త్వరలో బిగ్ షాక్..! కీలక లీడర్ జంప్..!!

Vasishta

ప్రధాని నరేంద్ర మోదీ అండతో రెచ్చిపోతున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీకి త్వరలో బిగ్ షాక్ తగలబోతోంది.! ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ ఓ వైపు పార్టీలన్నీ ఏకమై నిరసనగళం వినిపిస్తుంటే ఏమాత్రం పట్టించుకోని బీజేపీ.. ఎదురుదాడి చేస్తోంది. కేవలం మోదీ అండ చూసుకునే వీళ్లంతా విర్రవీగుతున్నారనే విషయం తెలిసిందే. అయితే ఆంధ్రాలో మోడీ హవా ఏం ఉండబోదోనే విషయం అందరికీ తెలిసిందే. ఏపీకి న్యాయం చేయకపోతే కాంగ్రెస్ నేతలకు పట్టిన గతే తమకూ పడుతుందేమోనని బీజేపీ నేతల్లో గుబులు మొదలైంది. అందుకే సేఫ్ జోన్ చూసుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో కీలకంగా వ్యవహరించిన ఓ నేత ఇప్పుడు త్వరలో పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు.


వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించి కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ విభజనానంతరం ఆ పార్టీని వదిలేసి బీజేపీ గూటికి చేరారు. బీజేపీలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీతో పొత్తును వ్యతిరేకంచే బ్యాచ్ లో కన్నా లక్ష్మినారాయణ ముందుంటారు. రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ-బీజేపీ కలసి పనిచేస్తున్నా... కన్నా లక్ష్మినారాయణ మాత్రం టీడీపీతో సఖ్యతగా మెలగలేదు. పైగా టీడీపీ వైఖరిపై ఎప్పటికప్పుడు పురంధేశ్వరితో కలిసి కేంద్రానికి నివేదికలు సమర్పించారు.


రాష్ట్రంలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా కేంద్రంలోని బీజేపీ నేతలతో మాత్రం కన్నా లక్ష్మినారాయణ నిత్యం సంప్రదింపులు జరిపారు. దీంతో కంభంపాటి హరిబాబు స్థానంలో కన్నా లక్ష్మినారాయణకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించబోతున్నారనే వార్తలు ఆ మధ్య జోరుగా వినిపించాయి. అయితే కేంద్రం మాత్రం అలాంటి సాహసం చేయలేదు పైగా మరోసారి కంభంపాటికే పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైందనే సంకేతాలిచ్చింది. దీంతో కన్నా లక్ష్మినారాయణ అలకబూనినట్లు సమాచారం. అందుకే ఇటీవల బీజేపీ – టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నా కన్నా మాత్రం ఎక్కడా స్పందించట్లేదు. అంతేకాదు.. ఈ మధ్య జరిగిన అంతర్గత సమావేశాలకు కూడా కన్నా దూరంగా ఉండిపోయారు.


రాష్ట్రాన్ని విభజించి తమకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ మనుగడ లేకుండా చేసిందని కన్నా పలుమార్లు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం బీజేపీకి వ్యతిరేకమైంది. బీజేపీ తమను మోసం చేసిందనే భావన ప్రజల్లో గట్టిగా ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన కన్నా లక్ష్మినారాయణ.. బీజేపీలో కొనసాగితే నాడు కాంగ్రెస్ లో పట్టిన గతే పడుతుందని భయపడుతున్నట్టు సమాచారం. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్టీ మారడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సో... బీజేపీకి త్వరలో బిగ్ షాక్ తగలబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: