'రాజీవ్' చనిపోతారని 'రాహుల్'కు ముందే తెలుసా..?

Vasishta

కొంతమంది తమ మరణాలను ముందే ఊహిస్తుంటారు. అలా ముందే చెప్పినవాళ్లను మనం అక్కడక్కడా చూస్తుంటారు. వారి మాటలు యాధృచ్ఛికం కావచ్చు, లేదా వారి దూరదృష్టి కావచ్చు.. ఏదైతేనేం భవిష్యత్ వాళ్లకు కనిపించి ఉండొచ్చు. తాజాగా.. రాహుల్ గాంధీ చెప్పిన ఓ మాట సంచలనం సృష్టిస్తోంది. తండ్రి రాజీవ్ గాంధీ చనిపోతారని రాహుల్ కు ముందే తెలుసంట..!!


          దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మరణం అందరికీ తెలిసిన విషయమే.! ఎల్టీటీఈ చేతుల్లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. 1991లో తమిళనాడులో పెరంబదూర్ వద్ద ఓ బహిరంగసభలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు ఆయన్ను హతమార్చారు. ఆయన మరణంతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది. రాజీవ్ మరణం తర్వాతా చాలా ఏళ్లపాటు నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ ఎన్నో ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీని మళ్లీ పట్టాలెక్కించాలంటూ పెద్దఎత్తున విజ్ఞప్తులు రావడంతో సోనియా పార్టీ పగ్గాలు చేపట్టారు.


          రాజీవ్ మరణానికి సంబంధించి రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సింగపూర్ లో పర్యటిస్తున్న రాహుల్.. ఓ సమావేశంలో పొల్గొన్నప్పుడు తన తండ్రి చనిపోతారని తనకు ముందే తెలుసన్నారు. కేవలం రాజీవ్ మాత్రమే కాదు.. నానమ్మ ఇందిర మరణం కూడా తాను ఊహించానన్నారు. తాను చనిపోతానని నానమ్మ తనకు ముందే చెప్పిందని రాహుల్ వెల్లడించారు. అంతేకాదు.. మీరు చనిపోతారని తండ్రి రాజీవ్ కు తాను చెప్పానని రాహుల్ చెప్పారు. నాన్న చనిపోయిన తర్వాత చాలా ఏళ్లపాటు తాము ఆ పాధ నుంచి బయటకు రాలేకపోయామని రాహుల్ వెల్లడించారు.


          తన తండ్రిని చంపిన వారిపై తనకు ఏమాత్రం కోపం లేదని రాహుల్ చెప్పారు. రాజీవ్ ను చంపిన ప్రభాకర్ చనిపోయినప్పుడు అతని డెడ్ బాడీ చూసి జాలేసిందన్నారు. ప్రభాకరన్ చనిపోయాడనే విషయం వెంటనే ప్రియాంకకు ఫోన్ చేసి చెప్పానని, తాను కూడా నాలాగే స్పందించిందన్నారు. రాజీవ్ ను చంపినవారిని క్షమించామని కూడా చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: