తెలంగాణ అసెంబ్లీలో సంచలన నిర్ణయం..! దేశవ్యాప్తంగా ఆశ్చర్యం..!!

Vasishta

తెలంగాణ అసెంబ్లీలో సంచలనాత్మక నిర్ణయం జరిగింది. నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన పరిణామాలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో దాడి చేసిన వారిపై బహిష్కరణతో పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఇద్దరి శాసన సభ్యత్వాలు రద్దు చేయడంతో పాటు 11 మందిపై సభ ముగిసేవరకూ సస్పెన్షన్ విధించారు.


          తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉమ్మడి సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగం కాపీలను చించేసి పోడియంపై విసిరేశారు. అయినా కూడా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ సభ్యులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి మైక్ విసిరేసారు. ఇది శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు తగిలింది. దీంతో ఆయన కంటికి గాయమైంది. ఆయన ప్రస్తుతం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.


          కాంగ్రెస్ సభ్యుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ సర్కార్.., ఇవాళ సభ ప్రారంభం కాగానే వారిపై శిక్ష తీసుకోవాల్సిందిగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. శాసన సభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేస్తూ తీర్మానం పెట్టారు. అంతేకాక.. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగిస్తూ పోడియంపై పేపర్లు విసిరిన డీకే అరుణ, జానారెడ్డి, పద్మావతి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాధవ్, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డిలను సభ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. అదే విధంగా మండలి సభ్యులైన షబ్బీర్ ఆలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ లపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.


          స్వామిగౌడ్ గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో నేతి విద్యాసాగర్ రావు మండలి బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రభుత్వం తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసించింది. బహిష్కరణ, సస్పెన్షన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అయితే ఎంఐఎం మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. బీజేపీ కూడా సభలో జరిగిన పరిణామాలు విచారకరమని ఆవేదన తెలిపింది. ఏదేమైనా తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి, సంపత్ లను బహిష్కరణ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: