మోదీకి మూడినట్లే..? ఆంధ్రోళ్లతో పెట్టుకుంటే అంతే..!

Vasishta

జాతీయ రాజకీయాలను తెలుగువారు శాసిస్తారనేది చాలాసార్లు చూశాం.. నాడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు పలుమార్లు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి ఆ సందర్భం వచ్చింది. నిన్నటివరకూ కేంద్రంలో కొనసాగిన టీడీపీ... బయటికొస్తున్నట్టు ప్రకటించగానే జాతీయ రాజకీయాలు మొత్తం ఆంధ్రవైపు చూశాయి. మోదీకి పెద్ద షాక్ అంటూ నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది..


          చంద్రబాబు అపరచాణక్యుడిగా పేరొందిన విషయం దేశం మొత్తానికీ తెలుసు. ఆచితూచి అడుగులు వేయడం, ఎత్తుకు పైఎత్తులు వేయడంలో చంద్రబాబు దిట్ట. సందర్భాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు ముందుంటారు. నిన్నటివరకూ బీజేపీకి అత్యంత నమ్మకమైన మిత్రపక్షం. నాలుగేళ్లు గడిచినా రాష్ట్రానికి న్యాయం జరగకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 29సార్లు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రంపై కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించారు. అయినా కూడా మార్పు రాకపోవడంతో చివరకా ఎన్డీఏ నుంచి వైదొలగాలని టీడీపీ నిర్ణయించింది.


          ఎన్డీయే నుంచి వైదొలగాలన్న టీడీపీ నిర్ణయం దేశాన్ని కుదిపేస్తోంది. టీడీపీ బయటికొచ్చి మోదీ సర్కార్ పై అవిశ్వాసం పెడ్తోందని తెలియగానే కాంగ్రెస్, టీఎంసీ, అన్నాడీఎంకే, ఎంఐఎం లాంటి పార్టీలు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. అంతేకాక ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా మేము సైతం అంటూ టీడీపీకి అండగా నిలిచాయి. మరోవైపు వైసీపీ కూడా అవిశ్వాస అస్త్రం ప్రయోగించడంతో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయపార్టీలు రెండూ కేంద్రానికి వ్యతిరేకంగా దేశ రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సత్తా ఏంటో జాతీయస్థాయిలో మరోసారి చర్చకు వచ్చినట్లయింది.


          టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానాల వల్ల బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. అయితే మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలకు అర్థమవుతుంది. టీడీపీ ఒక్క నిర్ణయం ఇప్పుడు దేశంలోని మోదీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఏకమయ్యేలా చేస్తోంది. సోమవారం అవిశ్వాసతీర్మానాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తనకు టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానాలు అందినట్లు లోక్ సభ స్పీకర్ ఇవాళే ప్రకటించారు. వాస్తవానికి అవిశ్వాస తీర్మానాలను పరిగణనలోకి తీసుకోకుండా లోక్ సభను నిరవధిక వాయిదా వేస్తారని అందరూ భావించారు. అయితే సభ సోమవారానికి వాయిదా పడడంతో అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ ఎదుర్కోక తప్పదు. మరోవైపు మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా టీడీపీ వివిధ పార్టీల మద్దతు కూడగడుతోంది. సభలో 54 మంది మద్దతు పలికితే ఆ తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. చివరగా ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ లో మోదీ నెగ్గొచ్చు. అయితే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చకు అవకాశం కలుగుతుంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: