ఏం చూసి బీజేపీ విర్రవీగుతోంది..? ఆ పార్టీకి ఎందుకంత ధీమా..?

Vasishta

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపధ్యంలో ఎన్డీయే బలాన్ని ఒకసారి పరిశీలిస్తే.. 2014 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయేలో బీజేపీ అతిపెద్ద పార్టీ. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ నేరుగానే మెజారిటీ సాధించింది. అయితే.. ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగానే పోటీ చేశారు కాబట్టి.. ప్రభుత్వాన్ని కూడా అలాగే ఏర్పాటు చేశారు. చెప్పుకోవడానికి ఎన్డీయేలో మొత్తం 46 పార్టీలు ఉన్నప్పటికీ.. లోక్ సభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు మాత్రం 13 మాత్రమే. వీటిలోనూ శివసేన, తెలుగుదేశానికి తప్ప రెండంకెల ఎంపీ సీట్లు ఉన్న పార్టీలు లేవు. సీట్లు ఎక్కువగా లేకపోయినా.. కాస్తో కూస్తో బలమైన పార్టీలుగా శిరోమణి అకాళీదల్, లోక్ జనశక్తి ఉన్నాయి. మిగతావాటిలో 8 పార్టీలకు ఒకరిద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు.

 

మిత్రపక్షాలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేసుకున్నా.. వారితో సఖ్యంగా ఉంటడంలో మాత్రం.. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం విఫలమైంది. ఇంకా చెప్పాలంటే... మిత్రపక్షాలను మింగేసి తానే బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించింది. ఈ విషయంపై ఇప్పటికే మిత్రపక్షాల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. శివసేన ఎన్డీయేలో రెండో అతిపెద్ద పార్టీ. ఈ పార్టీ ఇప్పటికే అనధికారికంగా బీజేపీకు కటీఫ్ చెప్పేసింది. తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని కూడా ప్రకటించేసింది. టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపింది. ఆ పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. మహారాష్ట్రలో శివసేనను పతనం చేసి బీజేపీని బలపరిచేందుకు అమిత్ షా ఎత్తుగడలు రూపొందించడమే బీజేపీపై శివసేన ఆగ్రహానికి కారణం. మిత్రపక్షంగా ఉండి తమ పతనానికే ప్లాన్ చేయడంతో బీజేపీ పేరు చెబితేనే శివసేన భగ్గుమంటోంది.

 

శివసేన, తెలుదుదేశం పార్టీల తరువాత వరుసలో ఉన్న బలమైన పార్టీలతో అయినా.. బీజేపీ సఖ్యతగా ఉందా.. అంటే.. అదీ లేదు. బీహార్ లో నిర్ణాయక శక్తిగా ఉన్న రాం విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఇప్పుడు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేతో కాకుండా లాలూతో కలిసి పోటీ చేయాలని పాశ్వాన్ భావిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఎన్డీయేలో మరో బలమైన పార్టీ శిరోమణి అకాళీదల్ కూడా బీజేపీ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. అయితే ప్రస్తుత అవిశ్వాస తీర్మానం సమయంలో మాత్రం ఎల్జేపీ, అకాళీదల్ బీజేపీకే మద్దతు ఇస్తున్నాయి. అయితే.. ఇదే సయోధ్య వచ్చే ఎన్నికల నాటికి ఉండదనేది విశ్లేషకుల అంచనా.

 

అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకు నిఖార్సైన మిత్రపక్షం లేనట్లే. ఎందుకంటే కూటమిలో ఉన్న మిగతా 40 పార్టీల్లో అన్నీ 2, 3 సీట్లలో ప్రభావం చూపించలేని పార్టీలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు.. కొత్తగా ఎన్డీయేలో చేరేందుకు కూడా దేశంలో ఏ పార్టీ ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే.. మిత్రపక్షంగా పక్కన చేరితే.. ఆ పార్టీనే మింగేసే వ్యూహాలను మోదీ, అమిత్ షా అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో మంచి ప్రచారం ఉంది. అందుకే ఎవ్వరూ ఎన్డీయే వైపు చూడటానికి కూడా సాహసించట్లేదు.

 

ఇదే సమయంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ వంటి కీలకమైన రాష్ట్రాల్లో బీజేపీకు ఎదురుగాలి వీస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ రాష్ట్రాల్లో గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 90 శాతం ఫలితాలను సాధించింది. ఈసారి హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో సగానికి పైగా సీట్లు తగ్గిపోయే అవకాశాలు ఉండటంతో బీజేపీకు పూర్తిస్థాయి మెజారిటీ రావడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో సునామీలా కనిపించిన మోదీ ఛరిష్మా.. ఇప్పుడు వ్యతిరేకతను మూటగట్టుకుంది. కాబట్టి ఈసారి వచ్చే ప్రభుత్వం కచ్చితంగా మిత్రపక్షాల బలంపైనే ఆధారపడాల్సి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.

 

నిజానికి మిత్రపక్షాలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.. ఈ పాటికే బీజేపీలో కలవరపాటు కలిగి ఉండాలి. కానీ అలాంటి సంకేతాలేమీ ఇన్నాళ్లూ కనిపించ లేదు. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చామని.. రాజకీయంగా తిరుగులేని శక్తిని సంతరించుకున్నామని ఆ పార్టీ నేతలు భావించారు. తమ బలమే మిత్రపక్షాల నిరుత్సాహానికి కారణమైందని బీజేపీ సీనియర్ నేతల అంచనా వేశారు. మరోవైపు.. అడపాదడపా అసంతృప్తి వ్యక్తం చేసినా.. బలమైన మిత్రపక్షాలు ఎన్డీయేను వదిలిపెట్టే అవకాశం లేదని ధీమాగా ఉన్న బీజేపీ నేతలకు టీడీపీ ఇచ్చిన ఝలక్ తో దిమ్మ తిరిగినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: