ఉరిమురిమి మంగలం మీదపడ్డట్టు ఈ టిడిపి ఎమెల్సీ టాలీవుడ్ మీద పడిపోయారెంటి?

ఏలమంచలి వెంకట బాబూ రాజెంద్ర ప్రసాద్ గారు తెలుగు దేశం పార్టీ ఎమెల్సి. ఈ రోజు సారు తీవ్రంగా టాలీవుడ్‌ పై  మండి పడ్డారు. అలా ఇలా కాదు ఎదుట ఎవరైనా టాలీవుడ్ నటుడు ఉండి ఉంటే భస్మీపటలమై ఉండేవారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు కళాకారులు ఎందుకు మద్దతివ్వరని ప్రశ్నించారు? మీరంతా హాలీవుడ్ స్థాయి నటులేం కాదన్నారు. వీరంతా హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే పనికొస్తారని, ఏజ్-బార్ అయిన నటులకు కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. 

ప్రజలపక్షాన నిలబడకపోతే వారు వెలివేతకు సిద్ధంగా ఉండాలని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం సభ్యులు కూడా మద్దతిచ్చిన విషయాన్ని మర్చిపోకూడదని, తెలుగు సినిమా కళాకారులు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడరని ప్రశ్నించారు. అవార్డుల విషయంలో లొల్లిచేసే వారంతా, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తమిళ నటుల్ని చూసైనా టాలీవుడ్ సెలబ్రిటీలు బుద్ది తెచ్చుకోవాలని  అన్నారు. జల్లికట్టు ఉద్యమాన్ని నడిపింది తమిళ నటులేనని, ఆ విషయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ వాళ్లు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు.

ప్రత్యేక హోదాకు మద్దతు పలకకపోతే, వారి సినిమాలను కూడా అడ్డకునేందుకు వెనకాడబోమని రాజేంద్రప్రసాద్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. మరి టాలీవుడ్ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది. ప్రజాజీవితం అంటూ ప్రభుత్వం తమ అభిప్రాయం ప్రకటించటానికి నాలు గేళ్ళు పట్టింది. ఇక నటీనటులు నిర్ణయం తీసుకోవటానికి కొంత సమయం పట్టదా? వారంతా తెలుగుదేశం పార్టీ వాళ్లు కాదు కదా? ఒకే నిర్ణయం తీసుకోవటానికి ఇంత త్వరగా? వాళ్ళూ ప్రజలను, ప్రతిపక్షాలను, ఇతర ప్రజా సంఘాలను కలుసుకోరా? కొంత సమయం కావాలి కదా? మరి బాబూ రాజెంద్ర ప్రసాద్ అలోచించరా? 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: