రేసులో కేసీఆర్ దూసుకెళ్తున్నారా..?

Vasishta

దేశం మార్పుకోరుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ మార్పు ఫెడరల్ ఫ్రెంట్ తో సాధ్యమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు కోసం కోల్ కతా వెళ్లిన కేసీఆర్ .. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. దేశంలో రాజకీయ సమీకరణలు, జాతీయస్థాయిలో సమస్యలపై చర్చించిన ఇరువురు నేతలు.. అతిపెద్ద ఫ్రంట్ గా ఫెడరల్ ఫ్రెంట్ ను నిర్మించడమే లక్ష్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించారు. కలిసొచ్చే పార్టీలతో సంప్రదింపులు జరిపి త్వరలోనే కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయించారు.


దేశంలో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శక్తులను ఏకం చేసేందుకు నడుం బిగించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు తొలి అడుగు వేశారు. ఫెడరల్ ప్రెంట్ ఏర్పాటుకు సంబంధించి కోల్ కతాలో ప్రాధమిక చర్చలు జరిపారు. సుమారు రెండు గంటల పాటు మూడో కూటమిపై చర్చించిన ఇరువురు నేతలు కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు.


దేశ ప్రజలంతా మరో ప్రత్యామ్నాయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. ప్రజల ఎజెండాతో త్వరలోనే తమ కూటమి ముందుకొస్తుందన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో మార్పు విషయంలో ఈ సమావేశం ఓ తొలి అడుగు మాత్రమేనన్నారు. ఇందుకోసం చాలామంది మిత్రులు తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌ లేదా బీజేపీ మాత్రమే పాలించిన దేశంలో ఏం మార్పు జరిగిందని ప్రశ్నించారు. అతిపెద్ద ఫ్రెంట్ గా ఫెడరల్ ఫ్రెంట్ గా అవరతించడం ఖాయమన్నారు కేసీఆర్.


దేశం మార్పు కోరుకుంటోందని, బలమైన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటవుతుందని మమతా బెనర్జీ  ఆశాభావం వ్యక్తంచేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులే నాయకులను సృష్టిస్తాయన్నారు. దేశాభివృద్ధి, రైతు సమస్యలతో పాటు దేశంలోని నెలకొన్న ఇతర సమస్యలపైనా ఫెడరల్ ఫ్రెంట్ దృష్టిపెడుతుందని.. రాష్ర్టాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని.. రాష్ర్టప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ముందుకు సాగాలన్నారు. భావసారూప్యత ఉన్న మిత్రులందరితోనూ చర్చలు జరుపుతామని చెప్పారు. కేసీఆర్, దీదీలు తీసుకున్న ఫెడరల్ ఫ్రెంట్ నిర్ణయంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దేశంలో తృతీయా ఫ్రెంట్ కు భీజం పడడంతో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. మొత్తానికి ఫెడరల్ ఫ్రంట్ కోసం తొలి అడుగు వేసిన కేసీఆర్ రేసులో ముందున్నారు. మరి యన ప్రయత్నాలు ఏమేరకు సఫలమవుతాయో వేచి చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: