బీజేపీ టార్గెట్ చేసింది.. ఇక చంద్రబాబుకు చుక్కలే..!

Chakravarthi Kalyan
నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని వెనుకటికి ఓ చీమ అన్నదని ఓ పిట్టకథ ఉంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. ఇన్నాళ్లూ ఏపీలో టీడీపీకి తోక పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు జూలు విదులుస్తోంది. కేంద్రంతో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో చంద్రబాబుకు చుక్కలు చూపించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. 


ఆ మేరకు పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లిపోయాయి. దాని ప్రభావం రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య జరిగిన వాగ్యుద్దమే అందుకు ఉదాహరణ. ఇన్నాళ్లూ పట్టిసీమ, పోలవరం విషయాల్లో చూసీ చూడనట్టుగా వెళ్లిన బీజేపీ నేతలు ఇప్పుడు అన్ని ఆరాలు తీస్తున్నారు. అవినీతి అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇందుకు కాగ్ నివేదికలు వారికి పనికొస్తున్నాయి.



పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు..  ఆ ప్రాజెక్టును సమర్దిస్తూనే అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పట్టిసీమలో నిధుల దుర్వినియోగాన్ని కాగ్‌ తప్పుబట్టిందన్నారు. క్యూబిక్‌ మీటర్‌ మట్టి తీయడానికి రూ.21,350 ఖర్చు చేశారని గుర్తు చేశారు. మొత్తం పట్టిసీమ ప్రాజెక్టులో రూ.371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. 


అంతే కాదు.. పట్టిసీమ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో కానీ.. సీబీఐతో దర్యాప్తు చేయించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్‌ చేశారు. అయితే విష్ణుకుమార్‌ రాజు 
ఆరోపణలను నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించారు. ఇవి కేవలం కాగ్‌ పరిశీలనలు మాత్రమేనని సభకు తెలిపారు. వాటికి తమ అధికారులు వివరణ ఇచ్చారన్నారు. మోడీ నుంచి వచ్చిన స్కెచ్ ప్రకారమే బీజేపీ డ్రామా ఆడుతోందని మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: