బీజేపీలో అధ్య‌క్ష వివాదం.. వైసీపీలోకి క‌న్నా!

VUYYURU SUBHASH
ఏపీ బీజేపీలో మ‌రో క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీతో విభేదించి త‌వ్ర‌స్థాయిలో రాష్ట్ర‌, కేంద్ర స్థాయిల్లో క‌ల‌క‌లం రేపిన బీజేపీలో రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి పెను సంచ‌ల‌నం సృష్టించింది. కాపు సామాజిక వ‌ర్గానికి పెద్ద వేయాల‌నే ఉద్దేశంతో బీజేపీ నేత‌లు ఈ ప‌ద‌వికి కాపు వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు రిజ‌ర్వ్ చేశారు. ఇప్ప‌టికే బీజేపీ ఏపీ అధ్య‌క్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు ప‌ద‌వీ కాలం ముగిసి ఏడాదైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు అధ్య‌క్షుడిని నియ‌మించ‌లేదు. అయితే, మ‌రోఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నందున బీజేపీ ఆచితూచి అధ్య‌క్షుడిని ఎంపిక చేసే క్ర‌తువును చేప‌ట్టింది. అయితే, ఈ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియ‌ర్‌, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. త‌న‌కు కాపు కోటాలో అయినా అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. 


వాస్త‌వానికి ఏపీలో బీజేపీ ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అధికార ప‌క్షం తీవ్ర‌స్థాయిలో బీజేపీపై యుద్ధం చేస్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి ప్ర‌జ‌లు ఓట్లేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ప‌లువురు బీజేపీ నేతలు పార్టీ మారేందుకు పావులు క‌దిపారు.ఈ వ‌రుస‌లోనే మొద‌ట్లో క‌న్నా.. పేరు కూడా వినిపించింది. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వైనా త‌న‌కు ద‌క్కుతుంద‌ని ఆయ‌న  ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, తాజాగా ఈ ప‌ద‌వికి పార్టీలోని సీనియ‌ర్ల‌నే ఎంపిక చేయాల‌ని, ఎప్ప‌టినుంచో పార్టీకి సేవ‌లందిస్తున్న వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని బీజేపీ అధిష్టానం నిర్ణ‌యించింది. దీంతో నిన్న గాక మొన్న క‌మ‌ల ద‌ళం చేరిన క‌న్నాకు ఈఅవ‌కాశం చేజారి పోయింది. దీంతో కన్నా   బీజేపీ అధిష్ఠానంపై కినుక వహించారు. పార్టీ మారిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 


ఈ క్ర‌మంలోనే కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో అనుచరులు, సన్నిహితులతో సమావేశం అయ్యారు. అలాగే ఈ సాయంత్రం పెదకూరపాడు నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. బీజేపీలో తగిన గుర్తింపు దక్కడం లేదని, ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు వేచి చూసినా ఫ‌లితం ఉండేలా లేద‌ని ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో చెప్పిన‌ట్టు స‌మాచారం. దీనికితోడు బీజేపీ అధిష్ఠానం నూత‌న‌ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును  ఖరారు చేసినట్లు సమాచారం.

దీంతో పరిస్థితి చేయి దాటిపోయిందని తెలుసుకున్న కన్నా ఇక పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కన్నా వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు  సమాచారం. త్వ‌ర‌లోనే ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని, గుంటూరులోని క‌న్నా సొంత నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కూడా ఇచ్చేలా ఒప్పందం జ‌రిగిపోయింద‌ని కొంద‌రు అంటున్నారు. మొత్తానికి రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నేది ఇందుకేనేమో!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: