చంద్రబాబుకు కష్టకాలం వచ్చేసిందా.. అవిగో సంకేతాలు..!?

Chakravarthi Kalyan
బురదలో ఉన్న పందితోనూ పవర్లో ఉన్న పొలిటీషియన్ తోనూ పెట్టుకోకుడదని ఓ పాత తెలుగు సినీ సామెత ఉంది. ఇప్పుడు దీన్ని కాస్త మార్చి చదువుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పవర్లో ఉన్న పొలిటీషియన్ అని కాకుండా.. సెంట్రల్ పవర్లో ఉన్న.. అని చదువుకుంటే బావుంటుంది. ఎందుకంటే.. సెంట్రల్ పవర్ ధాటికి ఆల్రెడీ పవర్లో ఉన్న పొలిటీషియన్లు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. 


నిన్న మొన్నటి వరకూ దాదాపు నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన చంద్రబాబు- మోడీ.. ఇప్పుడు విడాకులు తీసుకోగానే ఒకరిపట్ల మరొకరికి అనుమానాలు బాగా పెరిగిపోయాయి. తనను ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికిస్తారని చంద్రబాబు కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. పార్టీ వేదికలపైనా, అసెంబ్లీలోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ ఎందుకనో చంద్రబాబు ఈ అంశాన్ని బాగా ప్రస్తావిస్తున్నారు. 


తాజాగా జరిగిన ఓ సభలో ఏకంగా చంద్రబాబు.. నాకేమైనా అయితే ప్రజలంతా నాకు రక్షణగా ఉండాలని నేరుగానే చెప్పేశారు. చంద్రబాబు మరీ అంతగా పదే పదే అంటున్నారంటే.. కేంద్రం ఏదో గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. అయితే ఇన్నాళ్లూ తాను నిప్పు అంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఇంత బేలగా మారిపోతున్నారన్నది అర్థం కాని ప్రశ్న. 


గతంలో ఎన్నో విచారణలు వేసినా చలించని చంద్రబాబు.. ఇప్పుడు ఇంతగా భయపడటానికి కేంద్రంతో పెట్టుకోవడమే అని కొందరు విశ్లేషిస్తున్నారు. మరికొందరేమో ఆల్రెడీ కేసుల సంగతి ముందు తెలిసే చంద్రబాబు కావాలని గొడవలు పెట్టుకుని బీజేపీతో విడిపోయారని విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా త్వరలో చంద్రబాబుకు కష్టకాలం రాబోతోందన్న అర్థం చేసుకోవల్సి వస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: