జగన్ ప్రకటన వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ సభ్యులు!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగట్టడానికి ముందుకు సాగుతున్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గతంలో తన తండ్రి ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకు రావడమే కాదు..తర్వాత ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ప్రజా పక్షం వహిస్తున్న జగన్ అధికారంలోకి వచ్చే ముందు టీడీపీ చేసిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాదయాత్ర మొదలు పెట్టారు. 

కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) జిల్లాగా మార్చుతామని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన గ్రామస్తులు తమ బాధలను విన్నవించుకున్నారు. ఇక్కడ కొన్ని పథకాలు అమలు పరుస్తున్నామని చెప్పి టీడీపీ పార్టీ నేతలు డబ్బులు పంచుకుంటున్నారని..అభివృద్ది ఏమీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసుకున్నారు.

నిమ్మకూరులో నీరు-చెట్టు పథకం కింద జరుగుతున్న అక్రమాలను నందమూరి కుటుంబీకులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పూడికతీత పేరుతో చెరువు మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చెరువులో పొక్లెయిన్లతో తవ్విన దృశ్యాలను జగన్ కు చూపించారు. ఇవన్నీ ప్రత్యక్షంగా గమనించిన జగన్ మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే నిమ్మకూరు గ్రామాన్ని అభివృద్ది చేయడమే కాదు..కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు.  కాగా, ఈ ప్రకటనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది.

వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు ... జగన్ ప్రకటనను తప్పుబట్టారు. కృష్ణమ్మ ఎన్నో రాష్ట్రాలు దాటుకుని ఏపీలో ప్రవహిస్తోందని... కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తోందని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా కృష్ణా పేరుతో జిల్లా లేదని... మన రాష్ట్రంలో మాత్రమే ఉందని, అలాంటి మహా తల్లి పేరును మారిస్తే సహించబోమని హెచ్చరించారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని వ్యతిరేకించారు.

జగన్ తన హామీని వెంటనే ఉపసంహరించుకోవాలని... లేకపోతే పార్టీకి రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేపడతానని అన్నారు. కృష్ణా జిల్లా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి, ఉద్యమిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉన్నప్పుడు విగ్రహాలు పెట్టుకోవాలని, స్మారక భవనాలు కట్టుకోవాలని... జిల్లా పేరును మార్చడానికి మాత్రం ఒప్పుకోబోమని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: