కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్న సీబీఐ మాజీ జేడీ..!

Chakravarthi Kalyan

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావడం ఖాయం. కానీ అది ఏ పార్టీ అనేది అర్థం కాకుండా ఉంది. ఆయన కూడా ఎలాంటి క్లూ ఇవ్వకుండా ప్రస్తుతానికి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నానంటూ ఊరిస్తున్నారు. కొన్నాళ్ల పర్యటన తర్వాతే కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు. అయితే పక్కా పొలిటీషియన్ గా బాగానే పర్యటన సాగిస్తున్నారు.


ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. కవిటి మండలం సహలాలపుట్టుగ గ్రామాన్ని లక్ష్మీనారాయణ దత్తత తీసుకున్నారు కూడా . గ్రామానికి పెద్దన్నలా ఉండి ప్రగతి బాట పట్టిస్తానంటున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను, విశేషాలను ఓ విద్యార్ధిలా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టానని లక్ష్మీనారాయణ చెబుతున్నారు.


దూసిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని పరిశీలించారు. కార్మికులు, రైతులతో కర్మాగార స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత పాఠశాలకు వచ్చి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. మనం చదువుతున్న పాఠశాలకు మనమే ముఖ్య అతిథిగా వెళ్లేలా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.


బూర్జ మండలం నారాయణపురం ఆనకట్టను పరిశీలించిన సీబీఐ పూర్వపు జేడీ.. అక్కడ రైతులతో మాట్లాడారు. హిరమండలంలో వంశధార నదిపై ఉన్న గొట్టాబ్యారేజీని సందర్శించారు. రైతుల అనుభవాలను, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి సహలాల పుట్టుగ గ్రామంలోనే బస చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: