అంబానీకి కాబోయే అల్లుడితనే..!!

Vasishta

ముఖేష్ అంబానీ... పేరొక్కటి చాలు.. ప్రత్యేకంగా ఇంకేమీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. రిలయెన్స్ సామ్రాజ్యానికి అధినేత. ఫోర్బ్స్ బిలియనీర్లలో ఇండియా టాపర్ అతనే. అలాంటి వ్యక్తికి అల్లుడు కావాలంటే ఎంత అదృష్టముండాలో కదా..! ఇప్పుడు ఆ అదృష్టవంతుడెవరో తెలిసిపోయింది. ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీకి కాబోయే భర్త ఎవరో డిసైడైంది.


          ముఖేష్ అంబానీ ఇంట పెళ్లిభాజాలు మోగబోతున్నాయి. ఇప్పటికే కొడుకు ఆకాష్ అంబానీకి ఎంగేజ్ మెంట్ పూర్తయింది. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. అయితే కుమార్తె ఈషా అంబానీకి కూడా పెళ్లి ఫిక్స్ అయింది. ముఖేష్ అంబానీకి ఈషా ఏకైక కుమార్తె. 1991 జులై 23న జన్మించిన ఈషా స్కూలింగ్ అంతా అంబానీ స్కూల్ లోనే గడిచింది. ఆ తర్వాత యేల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో పట్టా పుచ్చుకున్నారు ఈషా. అనంతరం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ సాధించారు.


          ఈషా అంబానీకి కాబోయే భర్త ఆనంద్ పిరమల్. పిరమల్ రియాల్టీ కంపెనీకి ఇతను అధినేత. భారత్ లో ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఇది ఒకటి. దీనికంటే ముందు పిరమల్ స్వాస్థ్య అనే స్టార్టప్ ను స్థాపించారు ఆనంద్. గ్రామాల్లో వైద్య సేవలను అందించేందుకు ఈ కంపెనీ ఉద్దేశించింది. అంతేకాక.. పిరమల్ గ్రూప్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. పెన్నిసిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ లో పట్టా పొందారు ఆనంద్. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ పొందారు.


ఈషా, ఆనంద్ లు చిరకాల స్నేహితులు. ఈ క్రమంలో వాళ్లిద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. మహాబలేశ్వరంలో కుటుంబసభ్యుల మధ్య తన కోరికను ఆనంద్ ఈషాకు చెప్పారు. ఇందుకు ఈషా కూడా అంగీకరించడంతో పెళ్లి చేసేందుకు ముహూర్తానికి పచ్చజెండా ఊపారు. ఈ ఏడాది డిసెంబర్ లో వారి పెళ్లి భారత్ లోనే జరగనుంది. మరోవైపు అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీకి తన ఫ్రెండ్ శ్లోకా మెహతాతో ఇప్పటికే ఎంగేజ్ మెంట్ జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: