రూప! సెల్ఫీ విత్ స్వామీ! గట్స్ ఉన్న అమ్మాయి!

శ్రీమతి రూప దివాకర్ మౌడ్గిల్, ఆ పేరే ఉత్సాహం ప్రోత్సాహం ఇస్తుంది యువతకు. 2000 సంవత్సరపు ఐపిఎస్ బాచ్. సివిల్ సర్వీసెసులో 43వ రాంకర్. ఐపిఎస్ ను వరించిన యువతి. 18యేళ్ళుగా ఖాకీ బట్టలతోనే సహవాసం స్నేహం. ఇంకొంచెం ముందు కూడా ఎందుకంటే ఆమె తొలి నుంచీ అంటే విద్యార్ధి దశ నుండీ ఎన్సిసి కాడెట్. తమపై తమకు నమ్మకమున్న యువత అవినీతికి, అక్రమాలకు భయపడనవసరం లేదు అన్నది ఆమె నిశ్చిత మరియు సాధికార అభిప్రాయం. అందుకే ప్రతి సంవత్సరం ఒక వివాదం దాని వెనువెంటే ఒక బదిలీ. బదిలీలకు లెక్కే లేదు.


అయితే ఆమె ఈ మద్య బిజేపీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణ్యస్వామితో కలిసి దిగిన సెల్పీని జత చేస్తూ నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫోటో నెట్టింట్లో హ‌ల్-చ‌ల్ చేస్తుంది. దీంతో ప‌లువురు నెటిజ‌న్లు ఐపీఎస్ అధికారిణి రూప‌ మౌడ్గిల్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దానికీ కార‌ణం ఉంది.


దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కాలంలో ప్రభుత్వంలో సర్వత్రా అక్రమాలు చోటు చేసుకున్నాయ‌ని బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అనేక న్యాయ స్థానాల్లో ఫిటీష‌న్లు దాఖ‌లు చేశారు. దీంతో జ‌యలలితతో పాటు ఆమె ప్రియసఖి శ‌శిక‌ళ అక్రమాలు, అవినీతి, ఆదాయాన్ని మించిన అక్ర‌మాస్తుల తేనె తుట్టే కదిలింది. రెండు దశాబ్దాల పాటు నత్తనడకన సాగిన విచారణ తర్వాత బెంగుళూరు కోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో (జయలలిత మరణానంతరం) శశికళను కోర్టు దోషులుగా తేల్చింది.


అయితే అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు లో రాజ భోగాలు అనుభించారు. ఇదే  విషయాన్ని నాడు కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా ఉన్న‌ రూపా మౌద్గిల్‌ ఉన్నతాధికారులకు తన దర్యాప్తుతో సకల వివరాలను పూసగుచ్చినట్లు రాసిన లేఖను పంపించారు. జైళ్లశాఖ లోని ఒక సీనియర్‌ అధికారి శశికళ నుంచి ₹ 2కోట్ల నగదు తీసుకుని జైలు లో ఆమెకు వివిఐపి ట్రీట్‌మెంట్‌ కల్పించారని లేఖలో డిఐజి ఆరోపించారు.


ప్రత్యేక వంటగది, గదిలో పరుపు, టివి తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫొన్స్, స్వేచ్ఛగా తిరిగేందుకు వసతులు కల్పించారని కర్ణాటక పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ రూప్‌ కుమార్‌ దత్త కు ఫిర్యాదు చేశారు. శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని డిజిపి తన విచారణానంతరం తెలిపారు. దీంతో ఆమె ను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేయించారు. దాంతో ఎవరూ నమ్మని డిజిపి విచారణ పై వివాదం కూడా చెల‌రేగింది.


ఈ నేప‌థ్యంలో రూప సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తో క‌లిసి ఒక సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని నెట్టింట్లో ఫోస్ట్ చేసి, సుబ్ర‌మ‌ణ్య‌స్వామిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.  మీరు చాలా గొప్ప వ్యక్తి, మీరు ఫిర్యాదు చేయక పోతే ఆ వ్యక్తి జైలుకు వెళ్ళేవారు కాదేమో, మీ స్పూర్తి తోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలను తాను బయటపెట్టగలిగానని ట్వీట్ చేశారు.


ఈ ట్వీట్ పై ప‌లువురు నెటిజ‌న్లు "మీరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు" అని రూప ను ప్ర‌శ్నిస్తున్నారు.  దీనిపై స్పందించిన రూప, జైలు రిపోర్టు అందజేయ గానే నన్ను బదిలీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక పోలీస్‌ శాఖ ప్రవర్తించింది. అప్పుడు ఎవరూ పోలీస్ శాఖను గాని ప్రభుత్వాన్ని గాని ప్రశ్నించనైనా ప్రశ్నించ లేదు కదా? ఇప్పుడు నేను ఒక స్పూర్తిదాయక వ్యక్తి తో ఫోటో దిగితే రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇది సరి కాదు కదా! అంటూ ధీటుగా తిప్పి కొట్టారు. ఇప్పుడు రూపా మౌడ్గిల్ ను ఏవరైనా ఏం చేయగలరు. ఆమెను ప్రశ్నించటానికి మాత్రం ఎవరు సాహసిస్తారు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: