పాక్ తో స్నెహం 'పాముకు పాలుబోసిన చందం' అర్ధం చేసుకుంటున్న చైనా!


పాకిస్థాన్ నిజస్వరూపం బట్టబయలౌతుంది. చైనా ఇప్పుడిప్పుడే పాక్ ను అర్ధం చేసుకొనే దారిలో పడుతుంది.  సిపిఈసి ప్రోజెక్ట్ నిర్మాణం ప్రారంభమయ్యేవరకు మౌనమె నీ బాష ఓ మూగ మనసా! అన్నట్టున పాక్, చైనా కాలనీగా పరిగణించబడ్డ పాక్, నేడు వేయి శిరస్సుల కరాళ కాలసర్పం లాగా బుసలు కొడుతుంది చైనా పై. ఈ వ్యవహారం గతంలో భారత్ ఊహించిందే. 

చైనాకు భారీ షాక్‌ ఇచ్చేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైపోయింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్-సీపీఈసీ’ లో చైనా ఆధిపత్యాన్ని అజమాయిషీని తగ్గించే దిశగా పాకిస్థాన్ పావులు కదుపుతోంది. ప్రాజెక్టు పేరిట పాక్‌ సరిహద్దులో చైనా అడ్డగోలుగా భూదందాలకు పాల్పడుతోందని, దీనిని నిలువరించాలని కోరుతూ న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, దాన్ని పాకిస్తాన్ సుప్రెమె కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పరిణామాలతో ఒప్పందంలో కీలక సవరణలు చేయాలంటూ చైనా ముందు పాక్‌ ప్రతిపాదన ఉంచింది.

సుమారు 60 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో  చైనా — సీపీఈసీ ప్రాజెక్టును 2013లో మొదలుపెట్టింది. ప్రాజెక్టు ప్రారంభం అయ్యాక లీజుకు  తీసుకున్న భూముల్లో చైనీయులు కొందరు ప్రైవేట్‌ నిర్మాణాలు చేపట్టారు. రిక్రియేషనల్‌ పార్కులు, నివాస కాలనీలు నిర్మిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఒప్పందంలో ఎలాంటి షరతులు లేక పోవటంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతూ వస్తోంది. దీంతో ‘జఫరుల్లా ఖాన్‌’ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో సోమవారం  పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఆందులో  “చైనా తీరు అభ్యంతరకరంగా ఉంది. పాక్‌ గౌరవానికి భంగం కలిగించేలా బీజింగ్‌ వర్గాలు వ్యవహరిస్తున్నాయి. లీజుల పేరిట భారీ దోపిడీకి తెరలేపారు. పైగా ప్రాజెక్టు కొనసాగుతున్న ప్రాంతాల్లో నివసించే పౌరులను బానిసలుగా చూస్తున్నారు. ఈస్టిండియా కంపెనీ రెండు శతాబ్ధాలపాటు భారత ఉపఖండాన్ని ఎలా దోచుకుందో, ఇప్పుడు చైనా తీరు కూడా అలాగే ఉంది. ఏకపక్ష ఒప్పందం చేసుకుని చైనా లాభాలను పొందుతోంది. పాక్‌ వ్యాపారస్థులకు చైనా లో సరైన గౌరవం ఉండదు. కానీ, వారు పాక్‌లో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. సీపీఈసీ లోని ఒప్పందాలను సమీక్షించి, సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు పాక్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి. పాక్‌ సార్వభౌమత్వాన్ని కాపాడండి” అని పాక్  సుప్రీం  ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. 

ప్రభుత్వం తరుపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, “పిటిషనర్‌ వాదనల్లో వాస్తవం లేకపోలేదని, కానీ, సీపీఈసీ ఒప్పందంలో సవరణల కోసం చైనా ముందు ఇప్పటి కే ప్రతిపాదనలు పాక్‌ ప్రభుత్వం ఉంచిందని, అది పెండింగ్‌లో ఉంది” అని  వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్తీం కోర్టు పూర్తి నివేదికను సమర్పించాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
 
చైనా ప్రతిపాదించి ప్రారంభించిన ఈ మెగా ప్రాజెక్టు పై పాక్‌ మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కీలక ప్రాజెక్టు లో తమకు తగినంత ప్రాధాన్యం లభించట్లేదని, పైగా నిధుల విషయం లోనూ చైనా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆరోపించింది. 

ప్రాజెక్టులో భాగంగా రోడ్లు నిర్మించేందుకు చైనా జైళ్ల నుంచి పెద్ద ఎత్తున ఖైదీలను తరలించగా, పాక్‌ పార్లమెంట్‌ లో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. దీంతో ఖైదీలను వెనక్కి తీసుకోవాలంటూ చైనా ను పాక్‌ కోరింది. కానీ, అది జరగలేదు. 

ఇవన్నీ ఒక ఎత్తయితే, సీపీఈసీ ప్రాజెక్టు నిర్మాణం లో నాణ్యత లోపాలు బయటపడటం, గ్వదార్‌ వద్ద భూకంపం వాటిల్లే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో నిర్మాణంలో మార్పులు చేపట్టాలని చైనా ను పాక్‌ కోరింది. 

కానీ, చైనా మాత్రం ఏ విషయం లోనూ పాక్ ను ఖాతర్ చేయకుండా వెనక్కి తగ్గకపోవటంతో పాక్‌ తీవ్ర వత్తిడికి గురి అవుతుంది. ఇప్పుడు కోర్టు విచారణ నేపథ్యంలో ప్రాజెక్టు లో సవరణలు తప్పనిసరిగా చేయాలని, ఆధిపత్యాన్ని తగ్గించుకోవాలని, అలాకాని పక్షంలో ప్రాజెక్టును నిలువరించే ప్రయత్నం చేస్తామని  పాక్‌  చైనా కు సంకేతాలు పంపింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: