అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన సోము వీర్రాజు..అజ్ఞాతంలోకి!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు టీడీపీ పై ఓంటికాలిపై లేచి నానా యాగి చేసిన బీజేపీ నేత సోము వీర్రాజు సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తుంది. చివరి వరకు ఆ పదవి తనకు దక్కుతుందని ఆశించి భంగపడిన వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొన్నటి వరకు తనకు పదవి దక్కుతుందని..కేంద్రానికి సపోర్ట్ గా ఏపిలో అధికార పార్టీపై నిప్పులు చెరిగారు..తీరా చూస్తే తనకు దక్కుతుందన్న పదవి చేయి దాటిపోవడంతో ఖంగు తిన్నారు.

ఆదివారం సాయంత్రం వరకు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ఆయన అకస్మాత్తుగా ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. మరోవైపు రాత్రి ఎనిమిది గంటల సమయంలో సోము వర్గం తమ పదవులకు రాజీనామా చేసింది. తమ నేత వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసినట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తెలిపారు.

రాజీనామా పత్రాలను జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు పంపినట్టు పేర్కొన్నారు.రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన మనస్తాపం చెందారు. ఈ విషయాన్ని సన్నిహితులతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తొలుత ప్రకటించిన ఆయన సాయంత్రం తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోవడం పలు ఊహాగానాలకు తెరలేపింది.  
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: