ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత రజనీకాంతే..!

Vasishta

రజనీకాంత్.. పేరే ప్రభంజనం. సినీ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే ఇన్నాళ్లూ ఆయన రాజకీయాలపై నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు తమిళనాట నెలకొన్న రాజకీయ శూన్యత నేపథ్యంలో తాను కూడా పాలిటిక్స్ లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇదొక సంచలనం.


          తమిళనాడులో సినీ-పొలిటకల్ లీడర్లకు కొదువలేదు. ఎంజీఆర్, జయలలిత, విజయ్ కాంత్, శరత్ కుమార్.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడుమంది సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వారిలో ఎంజీఆర్, జయలలిత తిరుగులేని నేతలుగా ఎదిగారు. ఇప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ లిద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. మరి వీరి భవిష్యత్ ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ, ఆసక్తి తమిళనాడులో బలంగా ఉంది.


          కమల్ హాసన్ సంగతి పక్కనపెడితే.. తమిళనాడులో రజనీకాంత్ ప్రభావంపై అన్ని పార్టీల్లోనూ కంగారు మొదలైంది. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే రజనీకాంత్ ప్రభావం ఏమేరకు ఉంటుందోనని ఓ సర్వే చేయించినట్లు సమాచారం. తన అధికార ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా చేసిన ఆ సర్వే చూసి అన్నాడీఎంకే వర్గాలు ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. ఈసారి రజనీకాంత్ అధికారంలోకి రావడం ఖాయమని, 150కి పైగా నియోజకవర్గాల్లో ప్రజలు ఆయనకు పట్టం కట్టబోతున్నట్టు ఆ సర్వే తేల్చింది. ఆయన పార్టీ కూడా ఇంకా ప్రకటించకముందే 150 నియోజకవర్గాల్లో సుమారు 40 శాతం ఓటర్లు ఆయనవైపు టర్న్ అయ్యారని నిఘావర్గాలు అంచనా వేశాయి.


          కమల్ హాసన్ పార్టీ పేరు ప్రకటించి తనదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. అయితే రజనీకాంత్ మాత్రం ఇంకా పేరు ప్రకటించలేదు. రజనీ పీపుల్స్ ఫోరం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతర్గతంగా పార్టీ బలోపేతానికి ట్రై చేస్తున్నారు. మృదుస్వభావి కావడం, మితభాషి అయినా సామాజిక కార్యక్రమాల్లో ముందుండడం రజనీకి ప్లస్ పాయింట్. తిరుగులేని అభిమానగణం ఆయన సొంతం. అందుకే నాడు ఎంజీఆర్, ఎన్టీఆర్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రభంజనం సృష్టించినట్లే.. వారి తర్వాత అంతటి ప్రభంజనం రజనీకాంత్ సృష్టించబోతున్నాడనే టాక్ ఇప్పటికే తమిళనాడులో మొదలైంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: