‘ఆ రెండు’ జిల్లాలపై జగన్ స్పెషల్ ఫోకస్..!?

Vasishta

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర గోదావరి జిల్లాల్లోకి అడుగుపెట్టింది. ఇవాల్టితో ఆయన 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుంది. అయితే గోదావరి జిల్లాల్లో జగన్ యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గతంలో జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ రెండు జిల్లాలే...! అందుకే ఇప్పుడు జగన్ యాత్రకు ఎలాంటి స్పందన లభిస్తుంది.. ఎలాంటి వ్యూహాలు రచిస్తారు.. అనే దానిపై ఆసక్తి నెలకొంది.


          2014లో జగన్ అధికారంలోకి రాకపోవడానికి ఉభయగోదావరి జిల్లాలే కారణం అనే మాట ఎవరినడిగినా చెప్తారు. ఆ రెండు జిల్లాలే వైసీపీని దెబ్బకొట్టాయని ఆ పార్టీ నేతలు కూడా బాధపడుతుంటారు. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లోనే వైసీపీ గెలిచింది. తుని, కొత్తపేట, ప్రత్తిపాడు, రంపచోడవరం నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే ఆ తర్వాత ముగ్గురు టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఒక్కరే మిగిలారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు. ఆ జిల్లాలో ఒక్క సీటు కూడా రాకపోవడం ఆ పార్టీ ఖంగుతింది. అంటే ఉభయగోదావరి జిల్లాల్లోని మొత్తం 34 నియోజకవర్గాల్లో కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ నిలిచింది. ఈ రెండు జిల్లాల్లో కనీసం 10-15 సీట్లు వచ్చింటే తాము అధికారంలోకి వచ్చే వాళ్లమనే భావన ఆ పార్టీలో ఉంది.


          గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు ఈసారి ఏమాత్రం తావులేకుండా గోదావరి జిల్లాల్లో తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటోంది వైసీపీ. అందుకే ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకుంటోంది. ముఖ్యంగా సుమారు నెలరోజులపాటు ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే పాదయాత్రను ఎన్నికల్లో లబ్ది చేకూర్చేలా మార్చుకోవాలనుకుంటోంది వైసీపీ. నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకునేలా పాదయాత్రను ఉపయోగించుకోవాలనుకుంటోంది. నియోజకవర్గాల్లో బలమైన నేతలను గుర్తించడం, వారికి మరిన్ని బాధ్యతలను అప్పగించాలనుకుంటోంది. అదే సమయంలో ఉభయగోదావరి జిల్లాల్లో కుల ప్రభావం చాలా ఎక్కువ. ముఖ్యంగా కాపు సామాజికవర్గానిదే ఇక్కడ ఆధిపత్యం. ఈసారి ఆ వర్గం ఓటర్లను దగ్గర చేసుకోవడం ద్వారా లబ్ది పొందాలనుకుంటోంది వైసీపీ.


          జగన్ కు జనంలో మంచి క్రేజ్ ఉంది. ఎక్కడికెళ్లినా పాదయాత్రలో జగన్ కు నీరాజనం పలుకుతున్నారు. గత ఎన్నికల్లో కూడా జగన్ ఎక్కడికెళ్లినా జనం వచ్చారు. కానీ వచ్చిన జనాన్ని ఓటర్లుగా మలుచుకోవడంలో నాడు వైసీపీ విఫలమైంది. అయితే ఈసారి అలా కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరిపోయిన వారికి గట్టి బుద్ధి చెప్పడం, ఓడిపోయిన స్థానాల్లో గట్టి అభ్యర్థులను రంగంలోకి దించడం కోసం తగిన కార్యాచరణకు పాదయాత్రే సరైన సమయనుకుంటోంది వైసీపీ. ఆ దిశగా అడుగులు వేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: