గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీ ఆచూకీ దొరికింది!

Edari Rama Krishna
గోదావరి నదిలో ప్రమాదానికి గురైన లాంచీని ఎట్టకేలకు గుర్తించారు. దేవీపట్నం మండలం మంటూరు దగ్గర 60 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు కనుగొన్నాయి. సుమారు 60 అడుగుల లోతులోని ఇసుకలో లాంచీ కూరుకుపోయినట్టు తెలుసుకున్నారు. గల్లంతైనవారి మృత‌దేహాలన్నీ పడవలోనే ఉన్నట్టు గుర్తించిన అధికారులు, వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లాంచీ అద్దాలు పగులగొట్టి మృత‌దేహాలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 


లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నేవీ అధికారులు, గజ ఈతగాళ్లు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. ఉభయగోదావరి జిల్లాల మధ్యలో లాంచీ మునిగిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. లాంచీని గోదావరి నది నుండి బయటకు తీసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. భారీ క్రేన్ల సహయంతో లాంచీని నది నుండి బయటకు లాగేందుకు ప్రయత్నాలను   ఉదయం నుంచి ప్రారంభించారు. 


లాంచీని బయటకు తీయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ముందుగా మృత‌దేహాలను అందులో నుంచి తేవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఇండియన్ నేవీ సిబ్బంది నీటి లోపలికి వెళ్లి మృత‌దేహాలను బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం నాడు వాతావరణంలో మార్పుల గురించిన సమాచారం లాంచీ సిబ్బందికి అందించలేకపోయినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈదురుగాలుల కారణంగానే లాంచీ ప్రమాదానికి గురైందని కలెక్టర్ తెలిపారు. 


అయితే ఈదురుగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని లాంచీ సిబ్బందికి సమాచారం ఇచ్చేసరికి అప్పటికే లాంచీ నదిలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఈ సమాచారం లాంచీ సిబ్బందికి చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంలో 16 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా సుమారు 34 మంది గల్లంతయ్యారు. 


ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా రాత్రి సహాయచర్యలకు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ 120 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రాత్రంగా గాలిస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: