మోదీపై స్టాలిన్, బాబు ఫైర్..!

siri Madhukar
కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కర్ణాటకలో బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా గవర్నర్‌తో ఆహ్వానం తెప్పించుకున్నారని దుయ్యబట్టారు. గవర్నర్‌ని ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆరోపించారు. మరోవైపు బీజేపీ పదే పదే తప్పులు చేస్తుందని.. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోరుబాటను ఎంచుకోలేదని, రాజ్ భవన్ ముందు బైఠాయించి, అక్కడే స్నానపానాదులు కానిస్తూ దేశమంతా చర్చ జరిగేలా జాతీయ మీడియాను ఆకర్షించివుంటే బాగుండేదని బాబు అభిప్రాయపడ్డారు.

గవర్నర్, ఆయన కార్యాలయాన్ని వాడుకుని ప్రధాని మోదీ తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో దేశం మొత్తానికి తెలుసు. ఇప్పుడు కర్ణాటకలో కూడా మోదీ అదే అమలు చేశారు. ఇది భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే.. అని స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక గవర్నర్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా అని మీడియా అడగగా...  ఇప్పటికే తమిళనాడులో అది చూశాం. 

ఇప్పుడు కర్ణాటకలో జరుగతున్నది కూడా అదే...  అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. కాగా,  కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడంపై బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: