రమణదీక్షుతులు ఔట్..నలుగురు కొత్త ప్రధాన అర్చకుల నియామకం!

Edari Rama Krishna
రమణ దీక్షితులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రమణ దీక్షితులు అర్చక వృత్తి మరిచి రాజకీయ దీక్ష తీసుకున్నట్టుందని విమర్శించారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడడాన్నితీవ్రంగా ప‌రిగణిస్తున్నామన్నారు.  పక్క రాష్ట్రంలో ప్రెస్‌మీట్‌ పెట్టి ఎలా ఆరోపణలు చేస్తారని కేఈ ప్రశ్నించారు. ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు ఎన్నో తప్పులు చేశారన్నారు. 

గతకొన్ని దశాబ్దాలుగా తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తూ దేవదేవుడి సేవలో తరిస్తున్న ఏవీ రమణదీక్షితులు తొలగింపు ప్రక్రియ పూర్తయింది. టీటీడీ కొత్త చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత, తొలి సమావేశంలో, 65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు పదవీ విరమణను అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పూర్వపు మిరాశీ వ్యవస్థ ఆధారంగా, గొల్లపల్లి కుటుంబం తరఫున వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశం నుంచి కృష్ణ శేషాచల దీక్షితులు, పెద్దింటి వారి తరఫున శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ వంశీయుల నుంచి గోవిందరాజ దీక్షితులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వీరు తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించింది.  మరోవైపు తిరుమల కొండపై టిటిడి అధికారులు ఆగమశాస్త్ర విరుద్ధంగా కార్యక్రమాలను నిర్వహించి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నారని రమణ దీక్షితులు ధ్వజమెత్తారు. అంతేకాదు శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన లెక్కలను అధికారులు వెంటనే బహిర్గతం చేయాలని రమణదీక్షితులు డిమాండ్ చేశారు.

1996 వరకు వంశపారంపర్యంగా ఆలయ ఆభరణాలు సంరక్షిస్తూ వచ్చామని అయితే ఇప్పుడు ఆ ఆభరణాలకు లెక్కా పత్రం లేకుండా పోయిదని, జవాబుదారీతనం కరువైందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఆలయంలో అర్చకులకు ఏఏ విధులను అప్పగించాలన్న అధికారం, ఇంతవరకూ ప్రధాన అర్చకుల చేతిలో ఉండగా, ఆ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ, డిప్యూటీ ఈఓకు ఆ అధికారాన్ని బదలాయిస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా కలకలం రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: