ప్రజాధనం ధారుణంగా దుర్వినియోగం చేస్తుంది టిడిపి: పవన్ కళ్యాణ్


రానున్న 2019లో జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆశాభవం వ్యక్తం చేశారు. రాస్ఝ్ట్రానికి ప్రత్యేక ప్రతి పత్తి హోదాపై అనేక మాటలు మార్చి, కుప్పిగంతులేస్తూ ధర్మపోరాటం చేస్తున్నామంటూ చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించారు. ప్రత్యేకహోదాపై ఎవరిది చిత్తశుద్ధో? ప్రజాక్షేత్రం లో తేల్చుకుందామంటూ చంద్ర బాబుకు సవాలు విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, వైకాపాపైనా విమర్శల దాడి చేశారు.

ముఖ్యమంత్రి ప్రజల ధనం తన ఇష్టా రాజ్యంగా ఖర్చుచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ: 

"ఇన్ని దశాబ్దాలుగా ఉద్ధానం కిడ్నీసమస్య ఉంది. రూ.2వేల కోట్లకుపైగా పుష్కరాలకు ఖర్చుపెట్టారు. విదేశాలకు వెళ్లడానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఉన్నాయి. మొత్తం  క్యాబినెట్ మంత్రులందరినీ తీసుకెళ్లినా రూ.25 లక్షలకన్నా ఎక్కువ కాదు. అలాంటిది మీరు రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టారు. ఇలా ప్రతిసారి అధికారాన్ని మీ ఇష్టారాజ్యం గా వాడుకుంటే ఇక్కడ కిడ్నీ బాధితులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సాగునీటి అవసరాలను ఎలా తీరుస్తారు?" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పై పవన్ విరుచుకుపడ్డారు. అధికారం, పలుకుబడి కొన్ని కుటుంబాలు, వర్గాలకే వెళ్తోందని, డబ్బు, అభివృద్ధి కొందరికేనా? అని పవన్ ప్రశ్నించారు. 

"జనసేన అభివృద్ధి అందరికీ, కొందరికి కాదు. ఆ రోజులు పోయాయి. యువత మేల్కొంటోంది" అని జనసేనాని చెప్పుకొచ్చారు. "ఆనాడు తెలుగుదేశం మ్యానిఫెస్టోలో 600 పైచిలుకు హామీలున్నాయి. ఇవన్నీ సాధ్యపడతాయా? అని చంద్రబాబును అడిగాను. మీరు నన్ను నమ్మండి నేను చేస్తాను అన్నారు. నమ్మాను! కానీ ఏమైంది, ఏమీ చేయలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారనే ఆశతో నేను వాళ్లతో కలిసి నడిచాను. మనం ఐదు సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కలసి నడవాలని ఆనాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిజమే అనుకొని నేను నమ్మాను" అని పవన్ అన్నారు.
"ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయిన తరవాత టీడీపీ నాయకులను ప్రత్యేక హోదా గురించి అడిగాను. చేసేస్తామండి, ఇంకా తొలి బడ్జెట్ రాలేదు కదా! మీకు తెలీదు, పాలిటిక్స్ కొత్త కదా! ఇంకో ఆర్నెళ్లు ఆగండి చెప్తాం అన్నారు. రెండేళ్లు పూర్తయిన తరవాత నాకర్థమైంది వీళ్లు మొండిచెయ్యి చూపిస్తారని. రాజకీయాల్లోకి వచ్చి నేను గెలుస్తానో? ఓడతానో? నాకే తెలీదు. కానీ మిమ్మల్ని మోసం మాత్రం చేయను. నిజాయతీగానే ఉంటాను. ఎందుకంటే మిమ్మల్ని ఎంతో  మంది ఎన్నో రకాల మాటలు చెప్పి మిమ్మల్ని వంచించారు. నేను వంచించను. మంచో? చెడో? నేను నిజాయతీగా మీకు చెప్తాను. ఆ తరవాత తిడతారో? కొడతారో? మీ ఇష్టం. నాకా భయం లేదు. వీళ్లకు అధికారం మీద ఆశ. వాళ్ల విలాసాలకు కులాసాలకు డబ్బు సంపాదన, వాళ్లు ఎదగటానికే ఈ పదవులు, నిజంగా సేవ చేయడానికి కాదు" అంటూ అధికార పార్టీ నేతలపై పవన్ విమర్శల వర్షం కురిపించారు. . 

"ఉద్ధానం సమస్య మీద నేనే హార్వార్డ్ నుంచి డాక్టర్లను పిలిపించి మాట్లాడితే ప్రభుత్వం కొద్దిగా కదిలింది. రెండు మూడు హెల్త్ సెంటర్లు పెట్టింది. కానీ అది చంద్రడి మీద నూలు పోగంత. ఇంత పెద్ద కిడ్నీ సమస్యను బయటికి తీసుకొచ్చింది జనసైనికులు. అలాంటి జనసేన కార్యకర్తల తల్లిదండ్రుల పింఛన్లు ఆపడం, వారిని స్థానిక అధికారపక్ష నేతలు బెదిరించడం సరికాదు. ఇలాగే దాడులు చేస్తే మేం సహించే వ్యక్తులంకాదు. మేం న్యాయంగా పోతాం. బతకండి, మమ్మల్ని బతకనివ్వండి. కానీ మేమే బతుకుతాం! మిమ్మల్ని అణగదొక్కుతాం! అంటే ఉవ్వెత్తున్న ఒక సునామీలా లెగుస్తాం. ముంచెస్తాం. ఆ మాట మరిచిపోకండి. భయపడటానికి చేతులుకట్టకుని నిలుచునే వ్యక్తికాదు పవన్ కళ్యాణ్" అంటూ టీడీపీ నేతలకు జనసేనాని హెచ్చరికలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: