నీ గుడిలో ఏం జరుగుతోంది.. గోవిందా..!?

Vasishta

తిరుమలలో అర్చకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపైఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఆలయ ప్రతిష్టను దిగజార్చే స్థాయికి పరిస్థితి చేరుకుంది. శ్రీవారి ఆలయంలో పోటు జరిగిన ఘటన మొదలు, పింక్ డైమండ్ మిస్సింగ్ పై అనుమానాలు లేవనెత్తిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరోపణలు అవాస్తవాలంటూ.... ఆయన వ్యతిరేక వర్గం కొట్టిపారేసింది. శ్రీవారి ఆలయంలో ఎలాంటి అపచారాలకు ఆస్కారం లేదని, కేవలం ఉనికి కాపాడుకోవడానికే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ రెండు వర్గాల వాదన పక్కన పెడితే అసలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం జరుగుతోంది..


తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య విబేధాలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. శ్రీవారి ఆలయంలో ఆగమం ప్రకారమే అన్ని కైంకర్యాలు జరుగుతున్నాయని, స్వామి వారి ఆభరణాలు అన్నీ సక్రమంగానే ఉన్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. గతంలో జస్టిస్ వాద్వా కమిటీ, జస్టిస్ జగన్నాథరావు కమిటీలు... ఆభరణాలు సక్రమంగానే ఉన్నట్లు టీటీడీకి రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు... తన అంగీకారం తెలుపుతూ సంతకాలు కూడా చేశారన్నారు. ఇప్పుడు ఆయనే శ్రీవారి నగలపై పలు అనుమానాలు ఉన్నాయనడం హాస్యాస్పదమన్నారు.


అర్చకుల మధ్య చిన్నచిన్న వైరుధ్యాలు ఉంటాయని అంతమాత్రాన వీటిని అవకాశంగా తీసుకుని బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలు అంటూ తెరపైకి వచ్చి ఏకపక్షంగా ఉండటం సరికాదని.. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వెంకటపతి దీక్షితులు అన్నారు. వయోపరిమితి అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. గుప్తనిధుల తవ్వకాలు, ఆభరణాల కనుమరుగంటూ అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు ఏనాడూ సంప్రదాయEలను పూర్తిగా పాటించలేదని ఆగమ సలహాదారు సుందర వదన భట్టాచార్య మండిపడ్డారు.


శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య ఆధిపత్యపోరు ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కన్పించడంలేదు. శ్రీవారి ఆలయ విషయంలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆలయ ప్రతిష్ట మరింత దిగజారే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: