యద్దనపూడి మృతిపై పలువురి సంతాపం!

Edari Rama Krishna
ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని, యద్దనపూడి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రచయిత్రగా ఆమె నవలలు ఎంతో మందిని ప్రభావితం చేశాయని..సమాజంలో జరుగుతున్న నిజాలను ఆమె తన రచనల్లో చూపించేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 

 తెలుగు రాష్ట్ర ప్రజలు యద్దనపూడి సులోచన రచనలు బాగా ఇష్టపడే వారని ఈ కాలంలో ఆమెలాంటి గొప్ప రచయితలు చాలా అరుదుగా ఉన్నారని..అంతగొప్ప రచయిత్రి ఇప్పుడు మన మద్యలో లేదని తెలిసి ఎంతో బాధపడ్డానని..యద్దనపూడి మృతి తీరని లోటంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లుచేశారు. ‘తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి ఆమె చేసిన రచనలు ఉపయోగపడ్డాయి. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మానవ సంబంధాలే ఇతి వృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి’ అని కేసీఆర్ అన్నారు. కాగా, యద్దనపూడి సులోచనారాణి మృతిపై పలువురు రచయిత్రులు తమ సంతాపం తెలిపారు.


సులోచనారాణికి చాలా పురస్కారాలు దక్కలేదు :  తన లాంటి ఎంతో మంది రచయిత్రులు తయారవడానికి కారణం సులోచనా రాణి అని రచయిత్రి బలభద్రపాత్రుని రమణి అన్నారు. ఎనలేని సాహిత్య సేవ చేసిన ఆమెకు దక్కాల్సిన పురస్కారాలు చాలా మటుకు దక్కలేదని అన్నారు.  


సాహితీ ప్రియులకే కాదు రచయితలకూ తీరని లోటు : సులోచనా రాణి మృతి కేవలం సాహితీ ప్రియులకే కాదు రచయితలకూ తీరని లోటని రచయిత్రి కన్నెగంటి అనసూయ అన్నారు. సాహిత్యాన్ని ప్రతిఒక్కరికీ తీసుకెళ్లిన ఘనత సులోచనారాణికే చెందుతుందని అన్నారు.


ఎంతో మందిని సాహిత్యం వైపు మళ్లించిన నవలారాణి : ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎంతో మందిని సాహిత్యం వైపు మళ్లించి, కథా సాహిత్యం పట్ల అవగాహన కల్పించిన సులోచనారాణి నవలా రాణి అని రచయిత్రి సమ్మెట ఉమాదేవి ప్రశంసించారు.


 నేను ఏకలవ్య శిష్యురాలిని : యద్దనపూడి సులోచనారాణికి తాను ఏకలవ్య శిష్యురాలినని రచయిత్రి ఉషారాణి అన్నారు. ఆమె నవలల స్ఫూర్తితోనే తాను రచయిత్రిగా మారానని, ఆమె రాసిన నవలలు, సీరియల్స్ కు డైలాగ్స్ రాసే అదృష్టం తనకు లభించిందని, ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసం ఉండాలని ఆమె సృష్టించిన ప్రతి పాత్ర ద్వారా చెప్పారని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు కోరుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: