తిరుమలేశుడిపై ఆరోపణలు : చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతోందో తెలుసా..!

Vasishta

తిరుమలలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయంటూ మాజీ ప్రధాన అర్చకులు చేసిన కామెంట్లు రాజకీయ రంగు పులుముకున్నాయి. శ్రీవారి నగలు కూడా మాయమైందంటూ ఆయన చేసిన ఆరోపణలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. 65 ఏళ్లు నిండిన అర్చకుల జాబితాలో తన పేరు కూడా ఉండడంతో.. అక్కసుతోనే రమణ దీక్షితులు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని భావిస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన వెనుక రాజకీయ హస్తం ఉన్నట్టు ఓ నిర్ధారణకు వచ్చింది.


          శ్రీవారి నగలు మాయమైందని, కానుకలకు లెక్కాపత్రం లేకుండా పోయిందని, పోటులో తవ్వకాలు జరిగాయని, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయని మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇంతలోనే 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటర్మెంట్ ఇస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత అర్చకసంఘాలు ఏకమై రమణదీక్షితులకు మద్దతు పలికాయి. ఇంతలో రమణ దీక్షితులకు వ్యతిరేకంగా నాలుగు కుటుంబాలకు చెందిన శ్రీవారి అర్చకులు మీడియా ముందుకొచ్చారు. రమణ దీక్షితులు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని విమర్శించారు. ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పూజలు చేశారన్నారు.


          అలా మొదలైన ఈ తతంగం తాజాగా రాజకీయ రంగు పులుముకుంది. రమణ దీక్షితులు వెనుక బీజేపీ, వైసీపీ నేతలు ఉన్నారంటూ టీడీపీ నేతలు విమర్శించడం మొదలుపెట్టారు. ఆయన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులను కలిసిన ఫోటోలను బయటపెట్టారు. అంతేకాక.. వై.ఎస్.తో దిగిన ఫోటోను స్వామిఫోటోల పక్కన ఇంట్లో పెట్టుకోవడం మరిన్ని విమర్శలకు కారణమవుతోంది. వైసీపీ, బీజేపీ నేతల మాటలు విని ఏళ్ల తరబడి సేవ చేసిన శ్రీనివాసుడి ప్రతిష్టకు భంగం కలిగేవిదంగా లేనిపోని అభాండాలు వేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.


          ఇదే సమయంలో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని ప్రకటించారు. దీంతో ఈ అంశం వెనుక రాజకీయ హస్తం ఉందని పూర్తి నిర్ధారణకు వచ్చింది చంద్రబాబు సర్కారు. వెంటనే ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్, ఈవోతో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అంతేకాక.. టీటీడీపైన, శ్రీవారి నగలు, ఆగమశాస్త్ర విధానాలపైన వస్తున్న విమర్శలకు ఎప్పటికప్పుడు బదులివ్వాలని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు చట్టపరంగా విమర్శలను ఎదుర్కోవాలని టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై రమణ దీక్షితులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా.. శ్రీవారి ఆభరణాలను ప్రజలముందు ప్రదర్శించేందుకు, టీటీడీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని భక్తుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: