బీజేపీని బాదేస్తున్న బ్యాడ్ టైం..!! చలిచీమల సామెత తప్పదేమో..!!

Vasishta

బీజేపీకి బ్యాడ్ టైమ్ బాదేస్తున్నట్టుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమదే అధికారం అని భావిస్తున్న కాషాయదళానికి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మధ్య జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉపఎన్నికల్లో కూడా ఆ పార్టీ టైం ఏమాత్రం బాగోలేదు. ఇవాల్టి ఉపఎన్నికల ఫలితాల్లో సైతం బీజేపీ దారుణమైన పరాభావాన్ని చవిచూసింది.


దేశవ్యాప్తంగా జరిగిన 4 లోక్ సభ, 11 అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 4 లోక్ సభ స్థానాల్లో 3 సిట్టింగ్ స్థానాలు బీజేపీవే..! అయితే ఒక్క స్థానాన్ని మాత్రమే బీజేపీ నిలుపుకోగలిగింది. 2 చోట్ల ఘోరంగా ఓటమిపాలైంది. మహారాష్ట్రలోని పాల్ఘాడ్ లో మాత్రం శివసేన అభ్యర్థిపై బీజేపీ విజయం సాధించింది. ఇక భండారా-గోండియాలో మాత్రం ఎన్సీపీ ఘన విజయం సాధించింది. ఉత్తర ప్రదేశ్ లోని కైరానా సిట్టింగ్ స్థానాన్ని కూడా బీజేపీ కోల్పోయింది. అక్కడ ఆర్ఎల్డీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. యూపీలో ఇది బీజేపీకి గట్టి షాక్ ఇచ్చే పరిణామం. నాగాలాండ్ పార్లమెంట్ స్థానాన్ని ఎన్డీపీపీ కైవసం చేసుకుంది.


దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 11 అసెంబ్లీ స్థానాలు ఉపఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. కర్నాటకలో అభ్యర్థి చనిపోవడం ద్వారా వాయిదా పడిన రాజరాజేశ్వర నగర ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలోని పాలస్ కడేగావ్, మేఘాలయలోని అంపతి, పంజాబ్ లోని షాకోట్ లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. పంజాబ్ లోని షాకోట్ అకాలీదళ్ సిట్టింగ్ స్థానం కావడం విశేషం.


ఉత్తరప్రదేశ్ లోని నూర్పుర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. బీజేపీ చేతిలో ఉన్న ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ లోని మహేస్తల స్థానంలో అధికార టీఎంసీ గెలుపొందింది. కేరళలోని చెంగన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఎం మద్దతుదారైన ఎల్డీఎఫ్ అభ్యర్థి విజయం సాధించారు. బిహార్ లోని జోకిహాట్ లో అధికార జేడీయూకు పరాభవం తప్పలేదు. ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థి గెలవడంతో బీజేపీ-జేడీయూ కూటమి ఖంగుతింది. జార్ఖండ్ లోని సిలీ, గోమియా అసెంబ్లీ స్థానాలను జేఎంఎం కైవసం చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని థరాలీ స్థానంలో మాత్రమే బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.


ఓవరాల్ గా 4 లోక్ సభ స్థానాల్లో 1 చోట బీజేపీ గెలుపొందగా.. 3చోట్ల విపక్షాలు నెగ్గాయి. అలాగే 11 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానాన్ని మాత్రమే బీజేపీ నెలబెట్టుకోగలిగింది. మిగిలిన స్థానాల్లో 4 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల జేఎంఎం, 5 చోట్ల ఇతర పార్టీలు గెలుపొందాయి. ఉపఎన్నికల ఫలితాల అనంతరం.. బీజేపీకి వ్యతిరేక పవనాలు దేశవ్యాప్తంగా బలంగా వీస్తున్నట్టు అర్థమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: